సెల్యూట్‌ సైనికా

cinema Heroine has a Soldiers - Sakshi

మనందరికీ ప్రత్యేకంగా ఇల్లు ఉంటుంది. కానీ సైనికులు ఇండియా మొత్తం ఇంటిలానే భావిస్తారు. దేశం కోసం ప్రాణాలు విడవడానికి కూడా సిద్ధపడిపోతారు. అలా రియల్‌ లైఫ్‌లో ప్రాణాలు ఒడ్డిన సైనికులను మనం సిల్వర్‌ స్క్రీన్‌పై చూడబోతున్నాం. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మాణంలో ఉన్న ‘సోల్జర్‌’ బ్యాక్‌డ్రాప్‌ సినిమాల గురించి తెలుసుకుందాం.

కమాండో సందీప్‌
ముంబైలో 2008లో జరిగిన 26/11 ఎటాక్స్‌ దేశంలో సంచలనం సృష్టించాయి. ఆ దురదృష్టకర సంఘటనలో మరణించిన 174 (దాదాపుగా) మందిలో ఎన్‌ఎస్‌జీ (నేషనల్‌ సెక్యూరిటీ గార్డు) కమాండో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ ఒకరు. ఈ సంఘటన ఆధారంగా కొన్ని పుస్తకాలు వచ్చాయి. సినిమాలొచ్చాయి. వాటిలో రామ్‌గోపాల్‌ వర్మ తీసిన ‘ది ఎటాక్స్‌ ఆఫ్‌ 26/11’ ఒకటి. తాజాగా తెలుగు, హిందీ భాషల్లో ‘మేజర్‌’ అనే టైటిల్‌తో మరో చిత్రం తెరకెక్కనుంది. సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో హీరో అడవి శేష్‌ నటించనున్నారు. ఈ చిత్రానికి హీరో మహేశ్‌బాబు ఒక నిర్మాత. ‘గూఢచారి’ ఫేమ్‌ శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

అడవి శేష్‌, మహేశ్‌బాబు

కాపాడతాడు
శత్రువులు దేశంలోనే కాదు.. దేశం లోపల కూడా ఉంటారు. ఎవర్నైనా ఎదుర్కోవాల్సింది మన సైనికులే. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌›్డ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), ఎన్‌ఎస్‌జీ (నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌) ఇలా విభాగాలే వేరు. దేశ రక్షణే అందరి లక్ష్యం. దేశ ప్రధాని రక్షణకోసం ఓ ఎన్‌ఎస్‌జీ కమాండో ఎలాంటి సాహసం చేశారనే అంశం ఆధారంగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘కాప్పాన్‌’. (కాపాడతాడు) సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బొమన్‌ ఇరానీ, మోహన్‌లాల్, ఆర్య, సముద్ర ఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కేవీ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సూర్య, సముద్రఖని ఎన్‌ఎస్‌జీ కమాండోలుగా నటిస్తున్నారు. ప్రధానమంత్రి పాత్రలో మోహన్‌లాల్‌ నటిస్తారని తెలిసింది. సాయేషా కథానాయికగా నటిస్తున్న సినిమా ఆగస్టులో రిలీజ్‌ కానుంది.

సూర్య

కమాండో అర్జున్‌ పండిట్‌
ఆర్మీ ఆఫీసర్లు చేసే సీక్రెట్‌ ఆపరేషన్స్‌కు విభిన్నమైన పేర్లు పెడుతుంటారు. ఆలాగే గోల్డ్‌ఫిష్‌ అనే పేరుతో ఓ ఆపరేషన్‌ను షురూ చేశారు కమాండో అర్జున్‌ పండిట్‌. ఆ ఆపరేషన్‌ టార్గెట్‌ ఎవరు అనేది వెండితెరపై చూడాల్సిందే. వాస్తవ సంఘటనలకు కల్పిత అంశాలను జోడించి అడివి సాయికిరణ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’. ఇందులో కమాండో అర్జున్‌ పండిట్‌ పాత్రలో ఆది సాయికుమార్‌ నటించారు. శషా చెట్రి, కార్తీక్‌ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్‌ కీలక పాత్రలు చేశారు.

ఆది సాయికుమార్‌

సరిహద్దు సమరం
ఓ మంచి సక్సెస్‌ కోసం సరిహద్దుకు వెళ్లారు హీరో తనీష్‌. ఇటీవలే ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు తనీష్‌. 2008లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘నచ్చావులే’ హీరోగా ఇతనికి తొలి చిత్రం. ఆ తర్వాత హీరోగా చేయడంతో పాటు కృష్ణవంశీ ‘నక్షత్రం’ సినిమాలో విలన్‌గాను నటించారు. తనీష్‌ నెక్ట్స్‌ చిత్రం ‘సరిహద్దు’. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వి. కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సైనికుడి పాత్రలో నటిస్తున్నారు తనీష్‌. కార్తికేయ–తనీష్‌ కాంబినేషన్‌లో వచ్చిన రంగు సినిమాకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

తనీష్‌
దేశాన్ని రక్షించే సైనికుడంటే ప్రజలందరికీ గౌరవం ఉంటుంది. అందుకే సినిమా సైనికులను కూడా ఆదరిస్తుంటారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ‘సోల్జర్‌’ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇవి కాకుండా రానున్న రోజుల్లో మరెంతో మంది సైనికులను తెరపై చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా పాక్‌ చేతికి చిక్కి, ధైర్యంగా ఇండియా తిరిగొచ్చిన భారత ఆర్మీ కమాండర్‌ అభినందన్‌ మీద చాలా సినిమాలు వచ్చే చాన్స్‌ కనిపిస్తోంది. ఎందుకంటే బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు అభినందన్‌ బయోపిక్‌ కోసం టైటిల్స్‌ రిజిస్టర్‌ చేశారు. మనం ఇంట్లో హాయిగా నిద్రపోగలుగుతున్నామంటే బోర్డర్‌లో సైనికుల  కాపలానే కారణం. అందుకే సెల్యూట్‌ సైనికా..
 
రైఫిల్‌ మేన్‌ వస్తాడా?
ఈ ఏడాది  నేషనల్‌ ఆర్మీడే (జనవరి 15) సందర్భంగా ‘రైఫిల్‌మేన్‌’ అనే సినిమాలో సోల్జర్‌గా నటించనున్నట్లు వెల్లడించారు బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌. స్మాల్‌ టీజర్‌ని కూడా రిలీజ్‌ చేశారు. సోల్జర్‌ జస్వంత్‌సింగ్‌ రావత్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుందని వార్తలు వచ్చాయి. ఆయన జీవితంపై సినిమా తీసే హక్కులు మాకే ఉన్నాయంటూ ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ ముందుకు వచ్చిందట. దాంతో ప్రస్తుతానికి ‘రైఫిల్‌మేన్‌’ చిత్రం లీగల్‌ సమస్యలను ఎదుర్కొంటోంది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌

కార్గిల్‌ అమ్మాయి
సరిహద్దులో పాకిస్తాన్‌తో యుద్ధం చేయడానికి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ పైలెట్‌గా మారారు. 1999లో జరిగిన కార్గిల్‌ వార్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఫస్ట్‌ ఉమెన్‌ గుంజన్‌ సక్సెనా కీలకంగా వ్యవహరించారు. ఆమె జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో గుంజన్‌ పాత్రను జాన్వీ చేస్తున్నారు. ఇందుకోసం జాన్వీ విమానం నడపడంలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. శరన్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కార్గిళ్‌ గాళ్‌’ అనే టైటిల్‌ కూడా పెట్టారని బాలీవుడ్‌ సమాచారం. ఇటీవల మేజర్‌ షూటింగ్‌ లక్నోలో ప్లాన్‌ చేశారు. వేసవిలోపు ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారట. ఒక్కటంటే ఒక్క సినిమాలో మాత్రమే నటించిన జాన్వీ కపూర్‌కు ఇంత తొందరగా బయోపిక్‌ చాన్స్‌ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. మరి.. జాన్వీ ఏ మేరకు ఆడియన్స్‌ను మెప్పిస్తుందో తెలియాలి.

జాన్వీ కపూర్‌

అప్పుడు నీరు.. ఇప్పుడు నింగి
రెండేళ్ల క్రితం లెఫ్టినెంట్‌ కమాండర్‌ అర్జున్‌ వర్మగా నీటి లోపల పాకిస్తాన్‌ శత్రువులతో పోరాడారు రానా. ఇది ‘ఘాజీ’ చిత్రం కోసం. ఇప్పుడు ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ కోసం రానా మళ్లీ లెఫ్టినెంట్‌ కల్నల్‌గా బాధ్యతలు చేపట్టారు. 1971 ఇండో–పాక్‌ వార్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. గుజరాత్‌లోని భుజ్‌ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్తాన్‌ బాంబుల వర్షం కురిపించినప్పుడు ఏం జరిగింది? అనే అంశంపై ఈ సినిమా తెరకెక్కనుంది. అభిషేక్‌ దుథాయియా దర్శకత్వం వహిస్తారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌ కమాండర్‌ కల్నల్‌ విజయ్‌ పాత్రలో హీరోగా నటిస్తారు అజయ్‌ దేవగన్‌. మద్రాస్‌కి చెందిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ పాత్రను రానా చేస్తున్నారు. సంజయ్‌దత్, సోనాక్షీ సిన్హా, పరిణీతీ  చోప్రా ఇతర కీలక పాత్రధారులు. అలాగే ‘1945’ (తమిళంలో ‘మడైతిరందు’) అనే సినిమాలో కూడా రానా స్వాతంత్య్రానికి పూర్వం నాటి సైనికుడి పాత్రలో రానా కనిపిస్తారని తెలిసింది. దీనికోసం ప్రత్యేక కసరత్తులు చేశారట.

రానా

సైన్యంలో చేరతారా?
‘సైనికుడు’ పేరుతో వచ్చిన సినిమాలో మహేశ్‌బాబు నటించారు కానీ సరిహద్దు సైనికుడిలా మాత్రం కనిపించలేదు. అయితే..‘పోకిరి, దూకుడు, ఆగడు’ వంటి చిత్రాల్లో బాధ్యతాయుతమైన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించారు. ఇప్పుడు మహేశ్‌ సైన్యంలో చేరే సమయం ఆసన్నమైందని ఫిల్మ్‌ నగర్‌ సమాచారం. మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌గా మహేశ్‌ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.

మహేశ్‌బాబు
ఆర్మీ ఆఫీసర్‌ సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు సాగే ఫన్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని టాక్‌. ఇక వెంకటేశ్‌తో కలిసి నాగచైతన్య నటిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీమామ’. కేఎస్‌. రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో నటించబోతున్నట్లు తెలిసింది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ రాజమండ్రిలో జరిగింది. ఆ లొకేషన్‌లో ఆర్మీ ఆఫీసర్‌ కాస్ట్యూమ్స్‌ కనిపించడంతో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్నారనే టాక్‌కు మరింత బలం చేకూరినట్లయింది. మహేశ్‌బాబు, నాగచైతన్య ఆర్మీ జాయినింగ్‌ గురించి అధికారిక ప్రకటన వస్తే మరింత స్పష్టత లభిస్తుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top