ఇనుమడించిన ఉత్సాహంతో... | Balakrishna film shoot in fast progressing | Sakshi
Sakshi News home page

ఇనుమడించిన ఉత్సాహంతో...

Oct 2 2014 1:10 AM | Updated on Sep 2 2017 2:14 PM

ఇనుమడించిన ఉత్సాహంతో...

ఇనుమడించిన ఉత్సాహంతో...

హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మంచి హుషారులో ఉన్నారు.

హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మంచి హుషారులో ఉన్నారు. తాజా చిత్రంలో శక్తిమంతమైన సి.బి.ఐ. అధికారిగా నటిస్తున్న ఆయన, ఆగస్టు మొదట్లో కాలికి గాయం తగిలినా లెక్క చేయకుండా పన్నెండు రోజుల్లోనే మళ్ళీ షూటింగ్‌కు వచ్చేశారు. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మాణమవుతోంది.

ఇటీవలే ముగిసిన తాజా షెడ్యూల్‌లో నోబుల్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో త్రిష, మరో 20 మంది డ్యాన్సర్లతో కలసి అయిదు రోజుల పాటు పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. ‘‘హైదరాబాద్ పరిసరాల్లో ఈ పాట తీశాం. అక్టోబర్ 4 నుంచి తదుపరి షెడ్యూల్ నిర్విరామంగా చేయనున్నాం. ఇప్పటికే దాదాపు 40 శాతం సినిమా పూర్తయింది’’ అని నిర్మాత రుద్రపాటి రమణారావు ‘సాక్షి’కి చెప్పారు. ప్రకాశ్‌రాజ్, ఎమ్మెస్ నారాయణ సైతం తాజా షెడ్యూల్‌లో పాల్గొన్నారు.
 
12న ‘లెజెండ్’ డబుల్ సెంచరీ: ఇక, బాలకృష్ణ ఉత్సాహం మరింత పెంచుతూ ఇనుమడింపజేస్తూ, ఆయన ఇటీవలి చిత్రం ‘లెజెండ్’ డబుల్ సెంచరీ జరుపుకొంటోంది. శతదినోత్సవాలే కరవైన నేటి డిజిటల్ యుగంలో ‘లెజెండ్’ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేరుగా, ప్రొద్దుటూరులో సింగిల్ షిఫ్ట్‌తో 200 రోజులు ఆడింది.

ఈ సందర్భంగా అభిమానుల ఆధ్వర్యంలో, నిర్మాతల సహకారంతో భారీయెత్తున ఈ నెల 12వ తేదీ ఆదివారం ఎమ్మిగనూరులో ‘లెజెండ్’ ద్విశతదినోత్సవం జరుపుతున్నారు. బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు చిత్ర ప్రధాన తారాగణం, సాంకేతిక వర్గం హైదరాబాద్ నుంచి వెళ్ళి, ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ కెరీర్‌లో ‘ముద్దులకృష్ణయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా’ చిత్రాల తరువాత ఇది 5వ డబుల్ సెంచరీ కావడం విశేషం.

Advertisement
Advertisement