‘సింహం కడుపున సింహమే పుట్టింది’ 

Balakrishna Birthday Special Focus - Sakshi

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు

తండ్రికి తమ్ముడిగా, అన్న హరికృష్ణకు కొడుకుగా నటించారు నందమూరి నటసింహం బాలకృష్ణ. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు తమ్ముడిగా అన్నదమ్ముల అనుబంధం సినిమాలో నటించారు బాలకృష్ణ. ఈ సినిమాలో బాలకృష్ణ నటనను చూసి ‘సింహం కడుపున సింహమే పుట్టింది’ అని ఏఎన్నార్‌ అన్నారట. అవును నిజమే సింహం పేరు వింటే మనకు గుర్తొచ్చేది నందమూరి నటసింహమే. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా, సింహా ఇలా ఎన్నో ఇండస్ట్రీ హిట్‌ సినిమాలతో తన నట విశ్వరూపాన్ని చూపారు. అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుచుకునే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. 

బాలనటుడిగా తండ్రి ఆధ్వర్యంలోనే నటిస్తూ, నటనలోని మెలుకువలు తెలుసుకున్నారు బాలకృష్ణ. నందమూరి వంశాన్ని స్వర్గీయ ఎన్టీఆర్‌ నిలబెడితే, ఇంతవరకు ఆ పేరును కాపాడుకుంటూ వచ్చారు బాలకృష్ణ. 1974లో తాతమ్మ కల సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఇప్పటి వరకు వందకు పైగా చిత్రాల్లో నటించారు. ఈ శతాధిక నటుడు తన వందో సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేసి విజయాన్ని అందుకున్నారు. 

జానపదం, ఫ్యాక్షన్‌, యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ ఇలా అన్ని జానర్స్‌లో సినిమాలు తీసి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు బాలయ్య. వారసత్వ హీరోగా వచ్చినా.. అతి కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక శైలిని సృష్టించుకున్నారు. సగటు ప్రేక్షకుడు కూడా ఇష్టపడేది బాలయ్య డైలాగ్స్‌. ఇక  బాలయ్య డైలాగ్‌లు చెపుతూ ఉంటే అభిమానులకైతే పూనకాలే. బాలయ్య మార్క్‌ డైలాగ్‌లకు బాక్సాఫీస్‌ బద్దలవ్వాల్సిందే. 

నేటి తరంలో పౌరాణిక పాత్రలు వేయాలంటే ఒక్క బాలయ్య బాబు మాత్రమే వేయగలరు, చేయగలరు అనేంతలా అలరించారు. అభిమన్యుడు, పాండురంగడు, నారదుడు, సిద్ద, కృష్ణుడు, అర్జునుడు, శ్రీకృష్ణ దేవరాయలు, రాముడు ఇలా ఎన్నో పాత్రల్లో నటించారు. బాలయ్య హీరోగా తన కెరీర్‌ను 1984లో ‘సాహసమే జీవితం’ అంటూ మొదలుపెట్టగా, ‘మంగమ్మగారి మనవడు’గా తిరుగులేని హిట్‌ కొట్టారు. బాలయ్య కెరీర్‌లో ఎన్నో మరుపురాని చిత్రాలు ఉన్నాయి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ సినిమాలు తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయే చిత్రాలు. ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహానాయడు’ సినిమాలు బాక్సాఫీస్‌ రికార్డులకు దారిని చూపాయి. ‘సింహా’, ‘లెజెండ్‌’ సినినిమాలతో తన నటవిశ్వరూపాన్ని చూపారు. 

బాలయ్య కోసమే కొన్ని డైలాగ్‌లు పుట్టాయా అన్నట్లు ఉంటుంది. వాటిని ఆయన చెబితేనే అందం. వాటి కోసమే సినిమాకు వెళ్లే అభిమానులు కోకొల్లలు. బాలయ్య సినిమా వస్తోందంటే  బాలయ్యకు మాత్రమే సాధ్యమయ్యే డైలాగ్‌ డెలీవరిలో సంభాషణలు, భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉండాల్సిందే. మళ్లీ బాలయ్య తన నటవిశ్వరూపాన్ని ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నారు. నటసార్వభౌముడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ సినిమాలో బాలయ్య దాదాపు అరవై పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. రాముడిగా, కృష్ణుడిగా, కర్ణుడిగా, విశ్వామిత్రుడిగా, రావణాసురునిగా ఇలా ఎన్టీఆర్‌ చేసిన గొప్ప పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం. సో.. ఈ పాత్రల్లో బాలయ్య మరోసారి తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకోబోతున్నారు. మరిన్ని విజయాలు రావాలని, ఇంకా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తూ... నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top