గౌతమ్‌ మీనన్‌ సినిమాలో అనుష్క పోరాటం!

Anushka Next Film With Gautham Menons Action Thriller - Sakshi

అరుంధతి, బాహుబలి, భాగమతి.. ఇవి నటి అనుష్క సినీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రాలు. ఇలా అందాలారబోత పాత్రల నుంచి అభినయ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన నటి అనుష్క. తెలుగు, తమిళం భాషల్లో తనకంటూ ఒక ఇమేజ్‌ను సంపాదించుకున్న ఈ స్వీటీ తాజాగా సైలెన్స్‌ చిత్రంతో బాలీవుడ్‌ను టచ్‌ చేయడానికి సిద్ధం అవుతోంది. అవును భాగమతి చిత్రం తరువాత ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రం సైలెన్స్‌. తెలుగులో నిశ్శబ్దం పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సైలెన్స్‌ పేరుతో రూపొందుతోంది. 

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో మాధవన్‌, అంజలి, షాలినీపాండే ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న సైలెన్స్‌ చిత్రం త్వరలోనే తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్న అనుష్క తాజాగా దర్శకుడు గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతోంది. ఇదీ లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీన్ని వేల్స్‌ ఫిలిమ్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేశ్‌ భారీ బడ్జెట్‌లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

కాగా ఇందులో అనుష్కకు ఫైట్స్, చేజింగ్స్‌ అంటూ యాక్షన్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం. సాధారణంగా పాత్రలో ఇమిడిపోవడానికి శ్రాయశక్తులా కృషి చేసే అనుష్క ఇంతకుముందు బాహుబలి, రుద్రమదేవి వంటి చిత్రాల కోసం కత్తిసాము, గుర్రపుస్వారీ వంటి విద్యలో శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ మధ్య సైజ్‌ జీరో చిత్రం కోసం ఏకంగా 80 కిలోల వరకూ బరువును పెరిగింది. ఆ తరవాత ఆ బరువును తగ్గించుకోవడానికి పడరాని పాట్లు పడింది. చివరికి అమెరికా వెళ్లి బరువు తగ్గించుకుందని సమాచారం. దీంతో అనుష్క కొన్ని చిత్రాల అవకాశాలనూ కోల్పోయిందనే ప్రచారం ఆ మధ్య జోరుగా సాగింది. 

కాగా తాజాగా గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించే చిత్రం కోసం యాక్షన్‌ సన్నివేశాల కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అన్నట్టు దీనికి బాలీవుడ్‌ దర్శక, రచయిత గోవింద్‌ నిహలాలీ కథను అందిస్తున్నారని తెలిసింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. ఇక స్వీటీ యాక్షన్‌ అవతారం చూడడానికి  మనం కూడా వేచి చూద్దాం.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top