హాట్ సమ్మర్‌లో... కూల్ ఫిల్మ్ | Anasuya Ramalingam vs. Anand Vihari act in Nitin, Samantha | Sakshi
Sakshi News home page

హాట్ సమ్మర్‌లో... కూల్ ఫిల్మ్

Mar 10 2016 10:44 PM | Updated on Sep 3 2017 7:26 PM

హాట్ సమ్మర్‌లో... కూల్ ఫిల్మ్

హాట్ సమ్మర్‌లో... కూల్ ఫిల్మ్

శివరాత్రితో ‘శివ...శివ...’ అంటూ చలి ఎగిరిపోయి, ఎండలు పెరుగుతున్న టైమ్‌లో తెలుగు చిత్రసీమ కూడా క్రమంగా వేడెక్కుతోంది.

శివరాత్రితో ‘శివ...శివ...’ అంటూ చలి ఎగిరిపోయి, ఎండలు పెరుగుతున్న టైమ్‌లో తెలుగు చిత్రసీమ కూడా క్రమంగా వేడెక్కుతోంది. ఎగ్జామ్స్ సీజన్ అవగానే కొత్త సినిమాలతో బాక్సాఫీస్‌పై దాడి చేయడానికి దర్శక, నిర్మాతలు సిద్ధమవుతున్నారు. నితిన్, సమంత, మలయాళ ‘ప్రేమమ్’ ఫేమ్ అనుపమా పరమేశ్వరన్‌లు హీరో హీరోయిన్లుగా, దర్శక - రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘అ...ఆ...’ (అనసూయా రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) కూడా ఈ వేసవిలోనే మే 6న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) బృందం గురువారం నాడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఈ వారం టీజర్... మే 6న సినిమా
 కుటుంబమంతా కలసి చూసి ఆనందించదగ్గ, రొమాంటిక్-కామెడీ కోవకు చెందిన లవ్‌స్టోరీ ఇది. ‘‘ఇటీవలే కేరళలోని పొల్లాచ్చి పరిసరాల్లో కీలకమైన టాకీ, పాటలు చిత్రీకరించాం. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. శుక్రవారం నుంచి ప్యాచ్‌వర్క్ షూటింగ్, ఈ నెల 24 నుంచి వారం రోజుల పాటు రెండు పాటల చిత్రీకరణ చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. అలాగే, ఈ వారంలోనే సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయనున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలను ఏప్రిల్ రెండోవారంలో జనం ముందుకు తీసుకురానున్నారు. ఆ వెంటనే మే 6న సినిమా రిలీజ్.

 నిజాయతీ నిండిన ప్రయత్నం
నదియా, సీనియర్ నరేశ్, ప్రవీణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎన్. నటరాజ సుబ్రమణియన్ కెమేరా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. వ్యక్తుల మధ్య అనుబంధాలనూ, కుటుంబ సంబంధాలనూ త్రివిక్రమ్ మార్కు శైలి ఆహ్లాదకరమైన సన్నివేశాలు, సంభాషణలు, ఆలోచింపజేసే అంశాలతో నిజాయతీగా, వాస్తవిక ధోరణిలో ఈ సినిమాలో చూపెట్టనున్నట్లు భోగట్టా. వెరసి, గత వేసవికి అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో ప్రేక్షకులకు విందు చేసిన త్రివిక్రమ్ ఈసారి హీరో నితిన్‌తో పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘అ...ఆ...’ను జనం ముందుకు తెస్తున్నారు. ‘‘ఈ హాట్ సమ్మర్‌లో ఇది కూల్ సినిమా’’ అని చిత్ర యూనిట్ వర్గాలు అభివర్ణించాయి. ఎండలు మండే ‘మే’ వేళ ఎవరైనా కోరుకొనేది అదేగా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement