నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నాయి.
హైదరాబాద్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం ఉదయం 11.30 గంటల వరకు ఏఎన్‌ఆర్ భౌతికకాయాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఉంచనున్నారు. అనంతరం 12.30 గంటలకు ఫిలిం చాంబర్ నుంచి అంతిమ యాత్ర మొదలవుతుంది. మధ్యాహ్నం అన్నపూర్ణ స్డూడియోలోనే నాగేశ్వరరావుకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అక్కినేని బుధవారం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త తెలియగానే సినీ పరిశ్రమ, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజకీయ, చలనచిత్ర, వ్యాపార రంగ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి అక్కినేనికి నివాళులు అర్పించారు. అక్కినేనికి నివాళులు అర్పించిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.