ధరల మంట

Essential commodities rates are Increased - Sakshi

సంక్రాంతి పండుగకు సెగ

పెరిగిన నిత్యావసరాల రేట్లు

కాగుతున్న వంట నూనెలు

అ‘ధర’గొడుతున్న నువ్వులు, బెల్లం

బియ్యం, పప్పులదీ అదే దారి

ప్రియం అయిన పిండివంటలు

సామాన్య జనం ఆందోళన

పటాన్‌చెరు టౌన్‌: నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. రోజురోజుకూ మార్కెట్‌లో పెరుగుతున్న రేట్లను చూసి సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతి పండుగకు పిల్లలకు పిండివంటలు చేసి పెడదామని ఆశపడ్డ తల్లులు పెరిగిన ధరలకు చూసి బెంబేలెత్తిపోతున్నారు. నిన్న మొన్నటివరకు కిలో రూ.70 ఉన్న నూనె ధర ప్రస్తుతం రూ.85కి పెరిగింది. బియ్యం కిలో రూ.38 ఉండగా రూ.45 చేరింది. నువ్వులు కిలో రూ.100 ఉండగా ప్రస్తు తం రూ.120పైనే పలుకుతోంది. బెల్లం కిలో రూ.40 ఉండగా రూ.50పైగా విక్రయిస్తున్నారు. సం క్రాంతి పం డగకు వినియోగించే నూనెలు, నువ్వులు, పెసరపప్పు ధరలు అమాంతం పెరిగాయి. పిండివంట లు ప్రియం కావడంతో అవి లేకుండా పండుగ చేసుకో వాల్సి వస్తోందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్ని వర్గాలు జరుపుకొనే పండుగ..
ఖరీఫ్‌ పంటలు చేతికి వచ్చిన తర్వాత వచ్చే పండగ సంక్రాంతి.  రైతులు ఈ పండగను అనందోత్సహాల మధ్య జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. విద్యాసంస్థలకు వారం రోజుల పాటు సెలువులు ఇవ్వనుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులు, విద్యార్థులు, ఆడబిడ్డల రాకతో ప్రతి ఇంట్లో సందడి కనిపిస్తుంది. పండగకు ఇంటింటా పిండివంటల ఘమఘమలు వెదజల్లుతుంటాయి. ఈ ఏడాది ఆశించిన పంట దిగుబడుల రాకపోవడంతో రైతులు నష్టాల పాలయ్యారు. పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేకపోతున్నారు. మరోవైపు నిత్యావసరాల ధరలు భగ్గుమంటుండడంతో పండుగ ఎలా జరుపుకునేదని గ్రామీణ ప్రజలు వాపోతున్నారు. పిండివంటలో పండుగ ఘనంగా చేసుకోవాలంటే  అప్పు చేయక తప్పదని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 పండుగ ఎలా చేసేది?
నిన్న మున్నటి వరకు పెరసపప్పు కిలో రూ.60 ఉంటే ఇప్పుడు కిలో రూ.75కు చేరింది. నూనె ధర అమాంతం పెరిగింది. పిండివంటలు చేసుకుందామంటే పామాయిల్‌ ధరలు కూడా అందిరావడం లేదు. అన్ని ధరలు ఇలా పెరిగితే పండుగ ఎలా చేసుకునేది. పండుగకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులను  ప్రభుత్వం తక్కువ ధరలకు అందజేయాలి. – కొత్తకోట రాజేశ్వరి, గృహిణి

 రూ. వేలల్లో ఖర్చు చేయాలి
రోజురోజుకూ ధరలు పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో భయమేస్తోంది. పిండివంటలతో పండుగా వైభవంగా జరుపుకోవాలంటే వందల్లో వేలల్లో ఖర్చు చేయాల్సి వచ్చేలా ఉంది. కొత్త పంటలు చేతికి వచ్చే సమయంలో పండుగకు ధరలు దిగుతాయనుకుంటే పెరిగాయి.      – సుధారాణి గృహిణి

ధరలు ఇలా..
సరుకు            రెండు నెలల క్రితం    ప్రస్తుతం
నువ్వులు                   100           120
బియ్యం బీపీటీ            35             40
బియ్యం హెచ్‌ఎంటీ       44             48
సన్‌ఫ్లవర్‌ నూనె            75             85
పామాయిల్‌                60                70
కందిపప్పు                 65              70
పెసరపప్పు                68              75
మినుపపప్పు              70              75

Back to Top