ఏది ప్రేమ? ఏది మోహం?..

Scientific Definition To Love - Sakshi

ప్రేమ వేదం లాంటిది. చదవగలిగితే పరిపూర్ణతను ఇస్తుంది. ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించేలా చేయడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు. జీవితం పువ్వులాంటిది.. అందులోని మకరందమే ప్రేమ.

ప్రేమ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది. ప్రేమించడం పాపం కాదు. ఎందుకంటే అది పెరిగేది కడుపులో కాదు, హృదయంలో... ఈ ప్రపంచంలో ప్రేమకు కూడా ఏదో వ్యతిరేకత, అర్హత ఉండాలంటే ఇంత మంది ప్రేమించేవారు కాదు. ప్రేమించబడేవారు కాదు.

ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు. నువ్వు లేనప్పుడు నవ్వుని, నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం.

ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోవటానికి నెట్టింట సెర్చ్‌ చేస్తే దొరికే నిర్వచనాలు బోలేడన్ని. తమ అనుభవాలను, పాండిత్యాలను అంతా కలబోసి ఒక్కో మనిషి ఒకలా ప్రేమను నిర్వచిస్తాడు. కానీ, ‘‘ప్రేమ’’కు సైన్స్‌ ఇచ్చే నిర్వచనం వేరేలా ఉంటుంది. శరీరంలో చోటుచేసుకునే రసాయనిక మార్పుల ప్రభావమే ప్రేమ. ఓ వ్యక్తిని క్షణం కూడా విడిచి ఉండలేకపోవటం.. ఎంత చూసినా, ఎంత మాట్లాడినా తనివి తీరకపోవటం.. పదేపదే ఆ వ్యక్తి గురించి ఆలోచించటం.. చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవటం ఇలా ఒక్కో చర్యకు ఒక్కో హార్మోన్‌ ప్రభావం ఉంటుంది. ప్రేమలో ముఖ్యంగా మూడు దశలు ఉంటాయి. మొదటిది వ్యామోహం, కామం(లస్ట్‌).. రెండవది ఆకర్షణ(అట్రాక్సన్‌).. మూడవది అనుబంధం(అటాచ్‌మెంట్‌). ఈ మూడు దశలకు కొన్ని హార్మోన్లలో కలిగే మార్పులే కారణం.

1) వ్యామోహం(లస్ట్‌)
దీన్నే మనకు అర్ధమమ్యే భాషలో కామం అని అనొచ్చు. ఇది తమ శారీరక వాంఛలు తీర్చుకునేవరకు మాత్రమే ‘‘ప్రేమ’’ను నడిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం సెక్స్‌ హార్మోన్స్‌. మగవారిలో టెస్టోసిరాన్‌, ఆడవారిలో ఈస్ట్రోజన్‌ ఎదుటి వారి పట్ల సెక్స్‌ కోర్కెలను కలిగేలా చేస్తాయి.  ఈ హార్మోన్లలో కలిగే మార్పులను బట్టి కోర్కెలలో మార్పులు సంభవిస్తాయి.

2) ఆకర్షణ( అట్రాక్షన్‌)
అమ్మాయి అందంగా ఉందనో, అబ్బాయి కండలు తిరిగి, ఆరడుగుల ఎత్తు ఉన్నాడనో ప్రేమించటమన్నది ఒకరకంగా ఆకర్షణ కిందకు వస్తుంది. ఈ దశలో ప్రేమలు ఎక్కువ రోజులు మనలేవు. కొన్ని నెలలు.. కొన్ని సంవత్సరాలు.. ఎదుటి వ్యక్తి  మనికిచ్చే ప్రాధాన్యతపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆకర్షణకు ప్రధాన కారణం డోపమైన్‌, నోరెపినోఫ్రిన్‌, సెరోటోనిన్‌ అనే హార్మోన్లు. ఈ హార్మోన్లు మన శరీరంపై చూపే ప్రభావం కారణంగానే ఎదుటి వ్యక్తి  మీద మనకున్నది విపరీతమైన ప్రేమ అనే భావన కలుగుతుంది. ఇదే కొన్ని సందర్భాల్లో అనుబంధానికి దారితీయోచ్చు.

3) అనుబంధం(అటాచ్‌మెంట్‌)
మూడవది, అతిముఖ్యమైనది ఈ దశ. ఇందులోనే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎక్కువకాలం నిలుస్తుంది. అనుబంధానికి ముఖ్యకారణం ఆక్సిటోసిన్‌, వాసోప్రెస్సిన్‌ అనే హార్మోన్లు. శృంగారం సమయంలో, తల్లులు తమ పిల్లలకు చనుబాలు ఇస్తున్నపుడు, కాన్పు సమయంలో ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ విడుదలవుతుంది. ఇందుకారణంగానే బంధాలు గట్టిపడతాయి. వాసోప్రెస్సిన్‌ హార్మోన్‌ కూడా బంధాలు ఎక్కువకాలం కొనసాగేలా చేస్తుంది.

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top