మిస్సింగ్‌ యూ నాగ్‌, వచ్చే జన్మకైనా ..

Mouni Sad Ending Telugu Love Story - Sakshi

నేను డిగ్రీలో జాయిన్‌ అయిన కొత్తలో జీవితంలో ఏదో సాధించాలని బాగా ప్లాన్‌లు వేసుకున్నా. ప్రతిరోజూ కాలేజీకి వెళ్లేదాన్ని. అప్పుడే మా క్లాస్‌లో ఓ అబ్బాయిని చూశా. తన చిరునవ్వు నన్ను కట్టిపడేసింది. కళ్లు తిప్పుకోలేకపోయా. లవ్‌ యాట్‌ ఫస్ట్‌ సైట్‌ అంటే అదేనేమో. నాకు తెలియకుండా తన చిరునవ్వుకు అడిక్ట్‌ అయ్యా. ఇక తనని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండేదాన్ని కాదు. తన కోసమే కాలేజ్‌కు వెళ్లేదాన్ని. తనకు ఎంత అడిక్ట్‌ అయ్యానంటే! తనను చూడకుండా ఉన్న రోజు మొత్తం చాలా డల్‌గా అనిపించేది. నేనెప్పుడూ అతడితో మాట్లాడింది లేదు. నేను అతన్ని చూస్తున్నట్లు అతడికి అర్థం అయినట్లుంది. తను కూడా నన్ను చూసేవాడు. తను నన్ను ఎప్పుడైనా చూస్తే చాలా సంతోషించేదాన్ని. ఆ రోజంతా పండగలా ఉండేది. ఏదైనా బాధవస్తే తనను గుర్తు చేసుకునేదాన్ని.

ఒక రోజు తను కాలేజ్‌కు లేట్‌గా రావటం వల్ల క్లాస్‌లో ఉన్న సారు! తన గురించి అడిగాడు. అప్పుడు తెలిసింది అతడి పేరు. పేరు పాతగా ఉన్నా నాకు ప్రాణం అయిపోయాడు. ఫస్ట్‌ ఇయర్‌ గడిచిపోయింది. ఎలాగైనా నా ప్రేమను చెప్పాలని అనుకున్నా.  సెకండ్‌ ఇయర్‌ స్టార్ట్‌ అవ్వగానే ఓ హ్యాండ్‌ కర్ఛీఫ్‌లో ‘ఐ లవ్‌ యూ బంగారం’ అని పేయింట్‌ చేసి, అందరూ ల్యాబ్‌కు పోయిన తర్వాత నేను నా ఫ్రెండ్‌ ఆ కర్చీఫ్‌ను అతని బ్యాగ్‌లో పెట్టాం. తను దసరా తర్వాత చూశాడు. తను చూసినట్లుగా హ్యాండ్‌లో పెట్టుకుని తిరిగాడు. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మళ్లీ ఒకసారి లవ్‌ సింబల్‌ ఉన్న కీ చైన్‌ పెట్టాను. అది కూడా చూశాడు. ఇలా కుదరదని ఎఫ్‌బీలో రిక్వెస్ట్‌ పెట్టా. ఆక్సెప్ట్‌ చేసి మాట్లాడాడు. తనతో నా ప్రేమ విషయం చెప్పా. నేను ఎంత లవ్‌చేస్తున్నానో కూడా చెప్పా. అతనప్పుడు  ‘ అరే! నేను నిన్ను మోసం చేయటం ఇష్టం లేదురా. ఎందుకంటే నువ్వు చాలా మంచి అమ్మాయివి. నేను ఐదేళ్లనుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను.

తనకోసమే ఎదురు చూస్తున్నా’ అని అన్నాడు. నేను తట్టుకోలేకపోయా. గుండె పగిలిపోయినంత పనైంది. చచ్చిపోదామనుకున్నా కానీ, అమ్మకి ఒక్కదాన్నే కదా అని డేర్‌ చేయలేకపోయా. చాలా ఏడ్చా. ఆ తర్వాత అతన్ని ఇబ్బంది పెట్టలేదు. అలా మూడేళ్లు గడిచిపోయింది. మళ్లీ నేనే ఎఫ్‌బీలో మెసేజ్‌ చేశా ‘మనం మంచి స్నేహితులుగానైనా ఉందాం’ అని. ఎందుకంటే తనతో ఆ స్నేహం చాలు అనిపించింది. ఆ తర్వాతినుంచి నేనెప్పుడూ నా ప్రేమ విషయం ఎత్తలేదు. తనకు తెలుసు నేను తనని ఎంతలా ప్రేమిస్తున్నానో. చాలా సార్లు నా ప్రేమ విషయంలో బాధపడ్డాడు. నాతో అన్ని విషయాలు షేర్‌ చేసుకునేవాడు. ఫ్యామిలీ, లవ్‌ ప్రాబ్లమ్స్‌ అన్ని. మేమిప్పుడు మంచి మిత్రుల్లా ఉంటున్నాం. నాకిప్పుడు పెళ్లైంది. నేనిప్పుడు కోరుకునేది ఒక్కటే! తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని. మిస్సింగ్‌ యూ నాగ్‌, వచ్చే జన్మకైనా నీ ప్రేమను పొందాలని కోరుకుంటూ.. యువర్స్‌ గుడ్‌ ఫ్రెండ్‌
- మౌనీ


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top