చైతన్యకుమార్‌ మృతదేహం నేడు రాక

chaithanya kumar dead body today reached machilipatnam from us - Sakshi

 కలెక్టర్‌ చొరవతో స్వగ్రామానికి

ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు

చిలకలపూడి(మచిలీపట్నం): అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామిలో గత నెల 31వ తేదీ  అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన మచిలీపట్నానికి చెందిన యువకుడు బొమ్మల చైతన్యకుమార్‌ మృతదేహాన్ని కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం చొరవతో మృతదేహం శుక్రవారం మచిలీపట్నం చేరనుంది. మరణవార్త విన్న వెంటనే కలెక్టర్‌ రాష్ట్ర సాధారణ పరిపాలనా (ప్రోటోకాల్‌ ) విభాగానికి త్వరితగతిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయాలని లేఖ రాశారు. ఈ లేఖను ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ రెసిడెన్షియల్‌ కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌కు మెయిల్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపారు.

దీంతో పాటుగా కలెక్టర్‌ లేఖకు స్పందించిన తెలుగు అసోసియేషన్, తానా ప్రతినిధులు మృతదేహాన్ని మచిలీపట్నం చేర్చడానికి కావాల్సిన వనరులను సమకూర్చి ప్రయత్నాలను ప్రారంభించారు. అమెరికా నుంచి కృష్ణా జిల్లాకు మృతదేహం రావాలంటే సాధారణంగా 20 రోజుల సమయం పడుతుంది. అయితే కలెక్టర్‌ రాసిన లేఖకు స్పందించిన తెలుగు స్వచ్ఛంద సంస్థలు కేవలం ఎనిమిది రోజుల్లోనే అన్నీ అంశాలను పూర్తి చేసి గురువారం రాత్రికి హైదరాబాద్‌కు పంపుతున్నట్లు కలెక్టర్, ఏపీ భవన్‌ కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌లకు మెయిల్, మెసేజ్‌ ద్వారా వివరించారు. వీరు ఇరువురు మచిలీపట్నంలోని చైతన్యకుమార్‌ కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని అందించారు. హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నానికి మృతదేహ శుక్రవారం ఉదయానికి చేరనుంది.

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top