వ్యవసాయ మార్కెట్‌ గోదాం ‘మమ’

farmers facing problems with unused market warehouse in bonakal - Sakshi

శిథిలావస్థలో ప్లాట్‌ఫాం 

ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండిన ఆవరణం 

మధిర మార్కెట్‌ యార్డుకు అనుసంధానంగా రైతుల సౌకర్యార్థం మండల కేంద్రంలో నిర్మించిన వ్యవసాయ గోదాం నిరుపయోగంగా మారింది. 2010లో నాటి డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన సబ్‌మార్కెటింగ్‌ యార్డుకు ప్రారంభోత్సం చేశారు. దీంతోపాటు రూ.2లక్షల వ్యయంతో పంటను ఆరబెట్టుకునేందుకు ప్లాట్‌ఫాం కూడా నిర్మించారు. కానీ ప్రారంభానికే పరిమితమైంది. ఈ మార్కెట్‌ గోదాం ఉపయోగంలోకి రాలేదు. రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. పట్టించుకునే వారు లేరు. 

బోనకల్‌ : మార్కెట్‌ గోదాం ఆవరణం ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండి చిట్టడవిని తలపిస్తోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ మార్కెట్‌ శాఖ అధికారులు ఆ పని చేయకపోవడంతో గోదాం మూత పడింది. దీంతో మండలంలోని అన్ని గ్రామాల రైతులు పంటలను మధిర, ఖమ్మం తరలిస్తున్నారు. మండలంలో ఈ ఏడాది మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉందని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సబ్‌మార్కెట్‌ యార్డులోనే కొనుగోలు చేసి గోదాంలో నిల్వచేయాలని  రైతులు కోరుతున్నారు. అదేవిధంగా ప్లాట్‌ఫాం పగుళ్లు వచ్చి శిథిలావస్థకు చేరింది. మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభిస్తే రైతులు ధాన్యాన్ని, మార్కెట్‌కు తీసుకొచ్చే పంటలను ప్లాట్‌ఫాంపై ఆరబెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఉగయోగించని మార్కెట్‌ యార్డ్‌కు ఇటీవల రూ.1లక్షతో ఖర్చు ఆర్చి నిర్మించారు. సబ్‌ మార్కెట్‌యార్డును ప్రారంభిస్తే రైతులకు సౌకర్యంగా ఉండటంతోపాటు, నిరుపయోగంగా ఉన్న గోదాం, ప్లాట్‌ఫాం వినియోగంలోకి వస్తుందని రైతులు అంటున్నారు.

కొనుగోళ్లు ప్రారంభించాలి... 
బోనకల్‌లో నిర్మించిన సబ్‌మార్కెట్‌ యార్డులో కొనుగోళ్లు ప్రారంభించాలి. పండించిన పంటలను దూరప్రాంతాలకు వెళ్లి విక్రయించాల్సి వస్తోంది. ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గోదాం కూడా ఉందని, కానీ సిబ్బంది లేకపోవడంతో రైతులు ఎవరు తమ పంటలను దాచుకోవడం లేదు.  
– బందం అచ్చయ్య, రామాపురం, రైతు

మార్కెట్‌ లేక రైతుల అవస్థలు... 
రైతుల కోసం నిర్మించిన సబ్‌మార్కెట్‌ యార్డులో కొనుగోళ్లు జరుపకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. మార్కెట్‌ యార్డు నిర్మించారే తప్ప, కొనుగోళ్లు లేకపోవడంతో గోదాం నిరుపయోగంగా మారింది. ముళ్లపొదలు, చెట్లతో నిండి ఉంది.  ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. 
–హనుమంతరావు, రైతు ముష్టికుంట్ల  

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top