గల్ఫ్‌లో ఆగినగుండెలు

2 peoples died in gulf countries with heart attack - Sakshi

ఉపాధి కోసం వెళ్తే ప్రాణాలే పోయాయి

గుండెపోటుతో వలస కార్మికుల మృతి

శోకసంద్రంలో కుటుంబాలు

శవాల రాకకోసం ఎదురుచూపులు

బుగ్గారం/మేడిపల్లి: ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో గల్ఫ్‌బాట పట్టిన వలసకార్మికులను గుండెపోటు కబళించింది. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గంగాపూర్‌ గ్రామానికి చెందిన చిన్నకట్ట శంకరయ్య (45), మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన దౌడ భూమగంగారాం (40) గల్ఫ్‌లో గుండెపోటుతో మృతిచెందారు. దీంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. బుగ్గారం మండలం గంగాపూర్‌ గ్రామానికి చెందిన చిన్నకట్ట శంకరయ్య స్థానికంగా ఉపాధి లభించకపోవడంతో ఆరేళ్ల క్రితం సౌదీఅరేబియా వెళ్లాడు. రెండునెలల క్రితం వచ్చి కూతురుకు వివాహం జరిపించి తిరిగి వెళ్లాడు. అక్కడ పనిఒత్తిడి పెరిగిపోవడంతో నిత్యం మదనపడుతున్నాడు. ఈ క్రమంలో గుండెపోటుతో మంగళవారం చనిపోయినట్లు ఇక్కడి కుటుంబసభ్యులకు అక్కడి కార్మికులు సమాచారం చేరవేశారు. దీంతో మృతుడి భార్య గంగవ్వ, ఇద్దరు కుమారులు రంజిత్‌(16), రోహిత్‌ (12), కూతురు రస్మిత, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. శంకరయ్య మృతివార్త తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

వెళ్లిన 15 రోజులకే..
మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన దౌడ భూమగంగారాం (40) భార్య లక్ష్మి, కొడుకు రమేశ్, కూతుళ్లు రమ్య, రుచిత ఉన్నారు. గ్రామ పంచాయతీలో ఫట్టర్‌ పనిచేసిన ఆయన కుటుంబ పోషణభారం కావడంతో 12 ఏళ్ల క్రితం దుబాయికి వలసబాట పట్టాడు. అప్పటినుంచి వస్తూపోతూ ఉన్నాడు. అప్పులు పెరిగిపోవడంతో కొడుకు రమేశ్‌ను సైతం దుబాయి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఇంటికొచ్చిన గంగారాం.. కొడుకుకు పాస్‌పోర్టు సైతం తీయించాడు. డిసెంబర్‌ 30న తిరిగి దుబాయి వెళ్లిన ఆయన.. కొడుకును ఈనెల 9న దుబాయ్‌కి రప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 15న తను ఉంటున్న గదిలో పనిచేస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడని, ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడని అక్కడి కార్మికులు ఇక్కడకు సమాచారం చేరవేశారు. దీంతో కుటుంబసభ్యులు బోరుమన్నారు. గంగారాం భార్య లక్ష్మి కూలీపనులు చేస్తోంది. పెద్ద కూతురు రమ్య ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, చిన్నకూతురు రుచిత ఏడోతరగతి చదువుతున్నారు. గంగారాం మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top