‘ఇన్‌స్టాగ్రామ్‌’లో లైక్స్‌ నిషేధం!

Why Ban On Instagram Likes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో పోస్ట్‌ చేసిన ఫొటోలకు ఎక్కువ లైక్స్‌ వచ్చిన వారు ఎగిరి గంతెయ్యడం, తక్కువ లైక్స్‌ వచ్చిన వారు చిన్న బుచ్చుకోవడం నేడు అంతటా కనిపిస్తోన్న ట్రెండ్‌. పిచ్చి పిచ్చిగా లైక్స్‌ వచ్చే ఫొటోలకు ఇన్‌స్టాగ్రామ్‌ భారీ ఎత్తున డబ్బులు కూడా చెల్లిస్తున్న విషయం తెల్సిందే. ఇంతవరకు బాగానే ఉందిగానీ ఆస్ట్రేలియాలో తమ ఫొటోలకు లైక్స్‌ రానివారు మానసికంగా బాగా కుంగిపోతున్నారట. ఈ మధ్య ఒకరిద్దరు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా యూజర్స్‌కు వచ్చే లైక్స్‌ను తాము ఇక నుంచి బయట పెట్టమని, కనపడకుండా చేస్తామని ‘ఇన్‌స్ట్రాగ్రామ్‌’ యాజమాన్యం ప్రకటించింది. ప్రజల్లో సానుకూల మార్పు తీసుకురావడమే తమ వేదిక దక్పథమని కూడా పేర్కొంది. అయితే ఇదంతా అబద్ధమని, యాడ్స్‌ ద్వారా భారీగా డబ్బును దండుకోవాలన్నదే యాజమాన్యం వైఖరిగా కనిపిస్తోందని ఆస్ట్రేలియా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ నిపుణులు ఆరోపిస్తున్నారు. సహజంగా యాడ్స్‌ ఫొటోలకు లైక్స్‌ తక్కువగా వస్తాయని, అది బయటపడకుండా ఉండేందుకే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని వారంటున్నారు.

ఈ క్రమంలో ‘కాస్మోటిక్స్‌ నుంచి ప్రొటీన్‌ షేక్స్‌ వరకు అమ్ముతున్న అమ్మకం దారులు భారీగా లాభాలు గడిస్తుంటే, వాటిని ప్రచారం చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌కు అంతగా యాడ్‌ రెవెన్యూ రావడం లేదు. అందుకని చిన్న చిన్న వ్యాపారులను కూడా ప్రోత్సహించడానికి వీలుగా లైక్స్‌ను తీసివేయాలని నిర్ణయించి ఉంటుంది. అది ఒక్క ఆస్ట్రేలియాకే పరిమితం చేయడం అంటే ఇన్‌స్టాగ్రామ్‌కు ఈ దేశం నుంచే ఎక్కువ యాడ్‌ రెవెన్యూ వస్తోంది’ అని మార్కెటింగ్‌ నిపుణులు మర్మర్‌ బోస్‌ దేవ్‌ లెవెట్‌ వ్యాఖ్యానించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీ భామలు, ఫిట్‌నెస్‌ బ్లాగర్ల ద్వారా వ్యాపార సంస్థలకు ఏటా 2.50 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతుంటే ఇన్‌స్టాగ్రామ్‌కు కేవలం 20 లక్షల డాలర్ల యాడ్‌ రెవెన్యూ మాత్రమే వస్తుందని, అందుకని ఈ కొత్త ఎత్తుగడ అని మరొక మార్కెటింగ్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top