
జెనీవా : కరోనా మహమ్మారి మూలాలపై తర్జనభర్జనలు సాగుతున్న క్రమంలో ఫ్రాన్స్‌లో గత ఏడాది డిసెంబర్‌లోనే కోవిడ్-19 వెలుగు చూసిందనే వార్తను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఉటంకించింది. గతంలో అంచనా వేసిన దానికంటే ముందే అక్కడ కరోనా వ్యాప్తి మొదలైందనే సమాచారం ఆశ్చర్యపరచలేదని వ్యాఖ్యానించింది. గతంలో వెల్లడైన కరోనా అనుమానిత కేసులను విచారించాలని డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని అర్ధం చేసుకోవడంలో ఈ పరిశోధన ఉపకరిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి క్రిస్టియన్ లిండ్‌మీర్ పేర్కొన్నారు.
శాంపిల్స్‌ను తిరిగి పరీక్షిస్తే గత అనుమానిత వైరస్ కేసులు వెలుగుచూస్తాయని తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 36,71,812కు చేరగా మృతుల సంఖ్య 2,53,241కు పెరిగింది. ఇక భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 46,711కు పెరగ్గా 1583 మంది మహమ్మారి బారిన పడి మరణించారు. 13,161 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.