ఫ్రిజ్‌ డోర్‌ తెరవమంటే ఏకంగా ఫ్రిజ్‌నే లాక్కొచ్చింది | Viral Video: Service Dog Training Exercise | Sakshi
Sakshi News home page

కుక్కకు శిక్షణ: ట్రైనర్లు చచ్చారే

Feb 27 2020 3:43 PM | Updated on Feb 27 2020 4:41 PM

Viral Video: Service Dog Training Exercise - Sakshi

వాషింగ్టన్‌: శునకాన్ని కాపలా సింహంగానే చూడకుండా రకరకాల పనులు అప్పజెప్పుతున్నారు దానికి. పాల ప్యాకెట్‌ తీసుకురమ్మనో, పేపర్‌ పట్టుకురమ్మనో, ఫ్రిజ్‌లో నుంచి మంచినీళ్లు తెమ్మనో లేదా కాసేపు కలిసి ఆడుకోవడమో ఇలా చాలా రకాలుగానే ఉపయోగించుకుంటున్నారు శునకాలను. మనదేశంలో ఇది అరుదేమో కానీ విదేశాల్లో మాత్రం సర్వసాధారణం. ఇక శునకాలకు ఈమేరకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక సంస్థలు కూడా ఉంటాయి. అలా అమెరికాలోని కెంటకీలో ‘డబుల్‌ హెచ్‌ కెనైన్‌’ అనే ట్రైనింగ్‌ అకాడమీ ఉంది. ఇది కుక్కలకు రకరకాల పనులను నేర్పించే శిక్షణ సంస్థ. ఇందులో రైకర్‌ అనే శునకం శిక్షణకు వచ్చింది. దానికి పనులు చేయాలన్న ఆరాటమే కానీ ఏ ఒక్కటీ సరిగ్గా చేయలేకపోయింది.(ప్రియురాళ్లకు బాయ్‌ఫ్రెండ్స్‌ సర్‌ప్రైజ్)

పైగా ప్రయత్నించే  క్రమంలో అది చేస్తున్న పనులు నవ్వులు తెప్పిస్తున్నాయి. ఫ్రిజ్‌ డోర్‌ తెరవమంటే ఏకంగా ఫ్రిజ్‌నే లాక్కు రావడం, విసిరేసిన బంతి పట్టుకురమ్మంటే అది పరిగెత్తే క్రమంలో యజమానిని కింద పడేయడంలాంటివి చేస్తూ సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. జెర్మన్‌ షెఫర్డ్‌ జాతికి చెందిన ఈ శునకానికి శిక్షణ ఇస్తున్న వీడియోను ట్రైనింగ్‌ సభ్యులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఒకరకంగా కుక్కకు ట్రైనింగ్‌ ఇవ్వడానికి వారి తల ప్రాణం తోక్కొచ్చిందనుకోండి. కానీ గమ్మత్తైన విషయమేంటంటే మరో వీడియోలో ఈ రైకర్‌ అలవోకగా అన్ని పనులు చేస్తూ వావ్‌ అనిపించుకుంది. తన సాయశక్తులా కష్టపడి ఎట్టకేలకు అన్ని విద్యల్లో ఆరితేరిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కుక్కలకు ట్రైనింగ్‌ ఏంటి?
శునకాలకు ఇచ్చే శిక్షణలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి.
గైడ్ డాగ్స్: దృష్టి లోపం ఉన్న వాళ్లకు, అంధులకు సహాయపడే విధంగా శునకాలకు శిక్షణ నిస్తారు.
హియరింగ్ డాగ్స్: వినికిడి సమస్య ఉన్నవాళ్లకు సహాయపడేలా శిక్షణ నిస్తారు.
సర్వీస్ డాగ్స్: పైన వాటిలా ప్రత్యేకంగా ఒక పనికి కాకుండా రకరకాల పనులకు ఉపయోగపడేలా శునకాలకు శిక్షణ నిస్తారు. 
వీటితో పాటు మెడికల్ అలర్ట్ డాగ్స్, సైకియాట్రిక్ సర్వీస్ డాగ్స్... పేరుతో శునకాలకు శిక్షణ నిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement