
ప్రమాదానికి గురైన కారు
వికెన్‌బర్గ్ జాతీయ రహదారిపైకి చేరిన సమయంలో కారు అదుపు తప్పడంతో..
వాషింగ్టన్ : కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆరు రోజుల పాటు పొదల మాటున పడి ఉన్న ఆమెను రెస్క్యూ టీమ్ రక్షించి ఆస్పత్రిలో చేర్పించింది. అరిజోనాలో అక్టోబరు 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. 53 ఏళ్ల మహిళ తన కారులో అరిజోనాకు బయల్దేరారు. వికెన్‌బర్గ్ జాతీయ రహదారిపైకి చేరిన సమయంలో కారు అదుపు తప్పడంతో చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జనుజ్జయింది. అయితే జనసంచారం ఎక్కువగా లేని చోట ప్రమాదం జరగడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ క్రమంలో సమాచారం అందుకున్న అరిజోనా రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుంది. కానీ కారులో ఉన్న వ్యక్తి మాత్రం వారికి కనపడలేదు. దీంతో ఆమె కోసం అన్వేషణ చేపట్టారు. ఆరు రోజుల అనంతరం ప్రమాదస్థలి నుంచి సుమారు 500 మీటర్ల దూరంలో చెట్ల పొదల్లో ఉన్న మహిళను గుర్తించి, ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. కాగా ఈ విషయం గురించి పబ్లిక్ సేఫ్టీ ఏజెన్సీ డైరెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ మహిళ తీవ్రంగా శ్రమించారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఓ నది ఒడ్డుకు చేరుకునే క్రమంలో పట్టుతప్పి చెట్ల పొదల్లో పడిపోయారన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే పరిమిత వేగంతో వెళ్లాలని సూచించారు.