కశ్మీర్‌పై ఐరాస నివేదిక

United Nations releases first report on rights violation in Kashmir, PoK - Sakshi

హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ విచారణ జరపాలి

మోసపూరిత నివేదిక: భారత్‌

జెనీవా/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ విచారణ జరిపించాలని డిమాం డ్‌ చేసింది. కశ్మీర్‌కు సంబంధించి ఇలాంటి నివేదికను ఐక్యరాజ్యసమితి విడుదల చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ నివేదికపై భారత్‌ ఘాటుగా స్పందించింది. ఇది పూర్తిగా దురుద్దేశంతో కూడిన, మోసపూరితమైన, ఇతరుల ప్రేరణతో నివేదిక రూపొందించినట్లు ఉందంది. ఈ మేరకు భారత ప్రభుత్వం తన వ్యతిరేకతను ఘాటు వ్యాఖ్యలతో ఐరాసకు ఓ లేఖ ద్వారా తెలిపింది. ఈ నివేదిక భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత లను ఉల్లంఘించేలా ఉందంది. జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రం మొత్తం భారత్‌లో అంతర్భా గమని, పాక్‌ చట్టవిరుద్ధంగా, దురాక్రమణ ద్వారా భారత్‌ లోని కొంత భాగాన్ని ఆక్రమించుకుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

యూఎన్‌ ఆఫీస్‌ ఆఫ్‌ ద హై కమిషనర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ జమ్మూకశ్మీర్‌(కశ్మీర్‌ లోయ, జమ్మూ, లడఖ్‌ ప్రాంతాలు), పాకిస్తాన్‌ అడ్మినిస్టర్డ్‌ కశ్మీర్‌(ఆజాద్‌ జమ్ముకశ్మీర్, గిల్‌గిట్‌–బల్టిస్తాన్‌)లపై 49 పేజీల నివేదికను విడుదల చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు శిక్షలు పడకపోవడం, న్యాయం పొందే అవకాశం లేకపోవడం జమ్మూకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు ఎదురవు తున్న సవాళ్లని ఐరాస తన నివేదికలో పేర్కొంది. అయితే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)కు బదులుగా ఆజాద్‌ జమ్మూకశ్మీర్, గిల్‌గిట్‌ బల్టిస్తాన్‌ అనే పదాలను ఐరాస ఉపయోగించడంపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత భూభాగం గురించి నివేదికలో తప్పుగా పేర్కొనడం తప్పుదారి పట్టించేలా ఉందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, అసలు ఆజాద్‌ జమ్మూకశ్మీర్, గిల్గిత్‌ బల్టిస్తాన్‌ అనేవి లేనేలేవని పేర్కొంది. శాంతియుత కార్యకర్తలను అణచివేసేందుకు, వారిని హింసించేందుకు ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని దుర్వినియోగం చేసే చర్యలను నిలిపివేయాలని ఐరాస పాకిస్తాన్‌ను కోరింది. 2016 నుంచి జమ్మూ కశ్మీర్‌లో చెలరేగిన ఆందోళనలు, భద్రతాదళాల చర్యలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top