ఉయ్ఘర్లపై హింసకు వ‍్యతిరేకంగా ఐసీజేలో ఫిర్యాదు

Uighur Groups Take China to International Criminal Court  - Sakshi

బీజింగ్‌: పొరుగుదేశాలతో కయ్యానికి తయారుగా ఉండే చైనా.. తన దేశం లోపల కూడా పలు అరాచకాలకు పాల్పడుతుంది. అయితే ఆ దేశంలో ప్రభుత్వ ఆంక్షలు కఠినంగా ఉండటంతో అక్కడ జరిగే దారుణాల గురించి బయట ప్రపంచానికి వెంటనే తెలియదు. ముఖ్యంగా ఉయ్ఘర్ ముస్లింల పట్ల చైనా దారుణంగా ప్రవర్తిస్తోంది. వారిని కనీసం మనుషులుగా కూడా చూడదు. మానవహక్కులు అనే మాట ఉయ్ఘర్ల విషయంలో పూర్తిగా నిషేధం. అయితే చైనా ఇన్ని అకృత్యాలకు పాల్పడుతుంటే అంతర్జాతీయ సంస్థలైన ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం ఏం చేస్తున్నాయనే అనుమానం తలెత్తవచ్చు. చైనా వీటి ఆదేశాలను అస్సలు పట్టించుకోదు.

మరో ముఖ్యమైన అంశం ఏంటంటే చైనా అంతర్జాతీయ న్యాయస్థానంలో సభ్య దేశం కాదు. ఫలితంగా చైనా చేసే దుశ్చర్యలు ఐసీజే పరిధిలోకి రాకపోవడంతో అది ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. ఈ క్రమంలో చైనాను ఎదుర్కొనేందుకు రెండు బహిష్క్రిత ఉయ్ఘర్ల గ్రూపులు ఐసీజే తలుపు తట్టాయి. డ్రాగన్‌ కబంద హస్తాల నుంచి తమను కాపాడాల్సిందిగా కోరుతున్నాయి. ఆ వివరాలు.. (‘రోహింగ్యాలపై హత్యాకాండ ఆపండి’)

1. చైనా నుంచి బహిష్కరించబడిన రెండు ఉయ్ఘర్‌ గ్రూపులు ప్రస్తుతం చైనా, దాని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తమ పట్ల పాల్పడుతున్న నేరాల గురించి.. సృష్టిస్తోన్న మారణహోమం గురించి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాయి. 

2. ప్రభుత్వం బహిష్కరణ ఎదుర్కొంటున్న తూర్పు తుర్కిస్తాన్, తూర్పు తుర్కిస్తాన్ నేషనల్‌​ అవేకెనింగ్ ఉద్యమకారులు చైనా దాని నాయకులు కంబోడియా, తజికిస్తాన్లలో ఉయ్ఘర్లను దారుణంగా హింసిస్తున్నారని ఆరోపించారు.

3. అయితే చైనా ఐసీజేలో సభ్య దేశం కాదు. అలాంటప్పుడు వీరు ఎలా ఫిర్యాదు చేస్తారనే ఓ అనుమానం. దానికి వారు 2018-19లో వెలువడిన ఓ తీర్పు ఆధారంగా ఫిర్యాదు చేశామంటున్నారు. ఆ తీర్పు ఏంటంటే.. ఐసీజేలోని సభ్య దేశం పట్ల.. సభ్యత్వం లేని దేశం నేరాలకు పాల్పడితే.. అంతర్జాతీయ న్యాయస్థానం తన అధికార పరిధిని విస్తరిపంచేసి.. సభ్యత్వం లేని దేశాన్ని కూడా విచారించవచ్చని ఐసీజే తెలిపింది.

4. దీని ప్రకారమే బంగ్లాదేశ్‌లో రోహింగ్యాలపై జరుగుతున్న నేరాల గురించి మయన్మార్‌ ఐసీజేలో ఫిర్యాదు చేసింది. ఇక్కడ బంగ్లాదేశ్‌కు ఐసీజే సభ్యత్వం ఉండగా.. మయన్మార్‌కు సభ్యత్వం లేదు.

5. ప్రస్తుత కేసులో పిటిషనర్లు చైనా..  తజకిస్తాన్‌, కంబోడియా నుంచి ఉయ్ఘర్లను అక్రమంగా జిన్జియాంగ్‌ ప్రావిన్స్‌కు తరలించడమే కాక అక్కడ వారిని ఖైదు చేసి హింసిస్తుందని.. మతం మార్చడమే కాక బలవంతపు వివాహాలు జరిపిస్తుందని ఆరోపించారు.

6. చైనాకు ఐసీజేలో సభ్యత్వం లేనప్పటికి.. తజకిస్తాన్‌, కంబోడియాలు సభ్య దేశాలు కాబట్టి ఈ కేసును విచారించాల్సిందిగా పిటిషనర్లు కోరారు. ముఖ్యంగా జిన్‌పింగ్‌ ఈ ప్రాంతాన్ని సందర్శించి ‘సీక్రెట్‌ స్పీచెస్’‌ పేరుతో ఉయ్ఘర్లకు వ్యతిరేకంగా అమలు చేయాల్సిన చర్యల గురించి మార్గదర్శకాలు జారీ చేశారు. నాటి నుంచి హింస మరింత పెరిగింది. జిన్జియాంగ్‌లో ఉయ్ఘర్ల పట్ల జరుగుతున్న అణచివేత విధానాలపై అంతర్జాతీయ సమాజం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

7. ఉయ్ఘర్ల పట్ల జరుగుతున్న హింసకు సంబంధించి పలువురు నిపుణులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగా ఉపగ్రహ చిత్రాలు, ఉయ్ఘర్లకు  సంబంధించి చైనా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రహస్యంగా సేకరించే పనిలో ఉన్నారు. అయితే చైనాపై చర్యలు తీసుకోవడం అంత తేలికగా జరిగే పని కాదని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు చైనా ఉయ్ఘర్ల సమస్యను అంతర్గత వ్యవహారంగా పేర్కొంటుంది.

8. ఈ క్రమంలో  జర్మనీకి చెందిన ప్రసిద్ధ మానవ శాస్త్రవేత్త డాక్టర్ అడ్రియాన్ జాంజ్ చైనా దుశ్చర్యలను తెరపైకి తెచ్చారు. చైనా ప్రభుత్వం వెల్లడించిన పత్రాలను అధ్యయనం చేశారు జాంజ్‌. ఈ పత్రాలు మాండరిన్ భాషలో ఉన్నాయి. దీని ఆధారంగా చైనా ఏర్పాటు చేసిన రీ-ఎడ్యుకేషన్ క్యాంప్‌లో సుమారు 18 లక్షల మంది ఉయ్ఘర్ ముస్లింలను జైలులో పెట్టారని ఆయన పేర్కొన్నారు.

9. ముస్లిం జనాభాను తగ్గించడానికి చైనా అణచివేత విధానాలను అనుసరిస్తోందని జాంజ్‌ తెలిపారు. దేశంలోని మైనారిటీ ముస్లింలకు వ్యతిరేకంగా చైనా ప్రభుత్వం జనాభా,  సాంస్కృతిక మారణహోమం విధానాల ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.

10. ఉయ్ఘర్ ప్రజలపై చైనా అణచివేత ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా దీనిపై స్పందించింది. జూన్ చివరిలో మైక్ పాంపియో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా తన అణచివేత విధానాన్ని నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఉయ్ఘర్ల విషయంలో చైనా తీరు పట్ల అంతర్జాతీయ సమాజం స్పందించాలని పాంపియో కోరారు.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top