కిమ్‌తో భేటీ రద్దు: ట్రంప్‌

Trump cancels Singapore nuclear summit with North Korea - Sakshi

అణు పరీక్ష కేంద్రం ధ్వంసం చేసిన కొద్దిగంటల్లోనే ప్రకటన

వాషింగ్టన్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో తన భేటీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఏకపక్షంగా రద్దు చేశారు. జూన్‌ 12న సింగపూర్‌లో జరగాల్సి ఉన్న తమ భేటీ జరగబోవడం లేదని తేల్చిచెప్పారు.  ‘కిమ్‌తో భేటీ జరగొచ్చు. జరగకపోవచ్చు’ అంటూ బుధవారం ట్రంప్‌  వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా గురువారం ఆ భేటీ జరగడం లేదంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు కిమ్‌కు ఓ లేఖ రాశారు. ‘ఒకవైపు చర్చలు అంటూ.. మరోవైపు తీవ్ర విద్వేషాన్ని, బహిరంగంగా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు’ అంటూ ఆ లేఖలో ఆరోపించారు. అణుపరీక్ష కేంద్రాన్ని ఉత్తర కొరియా ధ్వంసం చేసిన కొద్ది గంటలకే  ట్రంప్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘మీతో చర్చల కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురుచూశాను. అయితే ఇటీవల మీ మాటల తీరు,  ప్రకటనల్లోని భాష చూస్తుంటే ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు అనవసరం అనిపిస్తోంది.

మీరు మీ అణు సామర్థ్యం గురించి మాట్లాడుతున్నారు’ అని ఆ లేఖలో ట్రంప్‌ పేర్కొన్నారు. ‘మన మధ్య చర్చలు గొప్పగా కొనసాగుతాయని భావించాను. భవిష్యత్తులో ఏదో ఒక రోజు మన మధ్య చర్చలు జరుగుతాయనే ఆశిస్తున్నాను’ అని కిమ్‌తో చర్చలకు ద్వారాలు తెరిచే ఉంటాయనే భావాన్ని ట్రంప్‌ వెల్లడించారు. ‘ఈ అత్యంత కీలమైన సదస్సు విషయంలో మీరు మనసు మార్చుకున్నట్లయితే నాతో మాట్లాడేందుకు సంకోచించవద్దు’ అని రాశారు. ఉత్తర కొరియాలో బందీలుగా ఉన్న ముగ్గురు అమెరికన్లను విడుదల చేసినందుకు కిమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని అమెరికా డిమాండ్‌ చేస్తుండగా తాము ఎట్టి పరిస్థితుల్లోను అణ్వాయుధాల్ని వదిలేది లేదని, మరింత ఒత్తిడి తెస్తే చర్చల ప్రక్రియ నుంచి వైదొలుగుతామని ఇటీవల ఉత్తర కొరియా హెచ్చరించింది.

అణు పరీక్ష కేంద్రాల ధ్వంసం
అణు పరీక్ష కేంద్రాల్ని ధ్వంసం చేస్తామని ప్రకటించిన విధంగానే ఉత్తర కొరియా తన మాట నిలబెట్టుకుంది. గురువారం విదేశీ జర్నలిస్టుల సమక్షంలో పంగ్యేరీ ప్రాంతంలో కొండల మధ్య ఉన్న మూడు సొరంగాలు, పలు పర్యవేక్షక కేంద్రాల్ని పేల్చివేసింది.  ట్రంప్, కిమ్‌ భేటీ రద్దు కావటంపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెర్రస్‌ విచారం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top