అంతరిక్షంలో ఆధిపత్య పోరు

Trump announces new US military 'space force' - Sakshi

స్పేస్‌ ఫోర్స్‌ ఏర్పాటుకు ట్రంప్‌ ఆదేశాలు

మరో ప్రచ్ఛన్న యుద్ధానికి తెర లేచినట్టే అంటున్న నిపుణులు

‘అంతరిక్ష రంగంలోనూ అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలి. ఇందుకోసం మిలటరీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని రక్షణ శాఖకు ఆదేశాలు జారీ చేస్తున్నాను. ఇప్పటికే ఉన్న ఐదు విభాగాలతో సమాన హోదా ఉంటూనే ఈ ‘స్పేస్‌ ఫోర్స్‌’ ప్రత్యేక విభాగంగా పనిచేస్తుంది’.. అంతరిక్ష విధానానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్న మాటలివి. రష్యా, చైనా మిలటరీ అవసరాల కోసం అంతరిక్ష రంగాన్ని వాడుకునేందుకు అనేక టెక్నాలజీలు రూపొందించుకుంటున్న నేపథ్యంలో అంతరిక్ష దళం ఏర్పాటు చాలా ముఖ్యమని ట్రంప్‌ అన్నారు.  

రేపటి యుద్ధరంగం అంతరిక్షం...
భవిష్యత్తులో యుద్ధమంటూ జరిగితే అది అంతరిక్షమే వేదికగా జరుగుతుందని మిలటరీ నిపుణుల అంచనా. శత్రుదేశాలు ప్రయోగించే క్షిపణులను అంతరిక్షం నుంచే నాశనం చేయడం.. ప్రతిదాడులకూ తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ఇందుకు కీలకమవుతుంది. స్టార్‌వార్స్‌ పేరుతో గతంలో అమెరికా ఈ దిశగా ప్రయత్నాలు చేసింది కూడా.

ట్రంప్‌ ప్రతిపాదిస్తున్న అంతరిక్ష దళం స్టార్‌వార్స్‌ తరహాలోనే అంతరిక్షంలో రక్షణ, ప్రతిదాడుల కోసం వ్యవస్థలను ఏర్పాటు చేస్తుందా? లేదా? అన్నది ప్రస్తుతానికి స్పష్టం కానప్పటికీ వీటిల్లో ఏది జరిగినా వివాదాస్పదం అవుతుందన్నది సుస్పష్టం. ఎందుకంటే అమెరికాతోపాటు రష్యా, ఇంకో వంద దేశాలు 1967లో చేసుకున్న అంతరిక్ష పరిరక్షణ ఒప్పందానికి ఇది విరుద్ధం. ఇప్పుడు ట్రంప్‌ నిర్ణయం మరో ప్రచ్ఛన్నయుద్ధానికి నాంది పలకడమేనని పలువురు పేర్కొంటున్నారు.

రష్యా, చైనాల ముందంజ
ఆయుధ వ్యవస్థల ఏర్పాటుపై నిషేధం ఉన్నప్పటికీ రష్యా, చైనాలు ఇటీవలి కాలంలో అంతరిక్షాన్ని మిలటరీ అవసరాల కోసం వాడుకునేందుకు కొన్ని టెక్నాలజీలను అభివృద్ధి చేసినట్లు వార్తలున్నాయి. ‘హైపర్‌ సోనిక్‌ గ్లైడెడ్‌ వెహికల్‌’ పేరుతో రష్యా తయారు చేసుకున్న సరికొత్త ఆయుధ వ్యవస్థను అంతరిక్షంలోకి ప్రయోగిస్తే చాలు...రాడార్‌ వ్యవస్థల కళ్లుగప్పి శత్రుదేశాలపై దాడులు చేయగలదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇటీవల ప్రకటించారు.

ఇంకోవైపు చైనా కూడా ఒక ఉపగ్రహం సాయంతో ఇతర ఉపగ్రహాలను,  క్షిపణులను పేల్చివేసేందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేసి, పరీక్షలు నిర్వహించింది. ఈ రెండు పరిణామాలు తమ దేశ భద్రతకు చేటు తెచ్చేవని అమెరికా భావిస్తోంది. ప్రస్తుతం అంతరిక్ష యుద్ధం విషయంలో మూడు రకాల ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి.

భూమిపై నుంచే లేజర్ల సాయంతో ఉపగ్రహాలు పనిచేయకుండా చేయడం ఒకటైతే.. అంతరిక్షంలోనే ఉంటూ ఈ పనులు చేయడం రెండో రకం. అంతరిక్షం నుంచి భూమ్మీది లక్ష్యాలను ఛేదించే వ్యవస్థలు మూడో రకం. అమెరికాతోపాటు రష్యా, చైనాలు మూడింటికీ ఈ రకమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది.

ఇప్పటికే ఓ వ్యవస్థ: అమెరికాలో ఇప్పటికే స్పేస్‌ ఫోర్స్‌ లాంటి వ్యవస్థ ఇప్పటికే ఉంది. ఎయిర్‌ఫోర్స్‌ స్పేస్‌ కమాండ్‌ పేరుతో 1982 నుంచి నడుస్తున్న ఈ వ్యవస్థ అటు వైమానిక దశం, ఇటు నేవీ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తూంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహాలపై నిఘా పెట్టడం, క్షిపణి ప్రయోగాలపై ఓ కన్నేయడం ఈ వ్యవస్థ ప్రధానమైన విధులు.         

– సాక్షి, హైదరాబాద్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top