అఫ్గాన్‌లో మారణహోమం

Taliban kill 95 with ambulance bomb in Afghan capital - Sakshi

కాబూల్‌లో అంబులెన్స్‌ బాంబుతో తాలిబన్‌ దాడి

95 మంది మృతి, 151 మందికి గాయాలు

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో శనివారం తాలిబన్లు మారణహోమం సృష్టించారు. నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 95 మంది ప్రాణాల్ని బలితీసుకున్నారు. ఈ దాడిలో 151 మంది గాయపడ్డారు. అంబులెన్స్‌లో భారీగా పేలుడు పదార్థాలు నింపి దానిని పేల్చేయడంతో ఈ ఘోరం జరిగింది.   ఏం జరిగిందో తెలియక కొద్ది సేపు షాక్‌కు గురైన ప్రజలు వెంటనే తేరుకుని పరుగులు తీశారు. పేలుడు తమ పనేనని ఉగ్రవాద సంస్థ తాలిబన్‌ ప్రకటించుకుంది. తాలిబన్‌ అనుబంధ సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌ పాత్ర ఉండవచ్చని అఫ్గాన్‌ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అంతర్యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న కాబూల్‌లో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న అతిపెద్ద దాడి ఇదే.  

భీతావహ వాతావరణం  
పేలుడు ధాటికి పలు భవంతులు, కార్యాలయాలు పాక్షికంగా ధ్వంసం కాగా.. మృతదేహాలు, రక్తమోడుతోన్న క్షతగాత్రులతో ఆ ప్రాంతం భీతావహ వాతావరణాన్ని తలపించింది. రెండు కిలోమీటర్ల దూరంలోని భవనాల అద్దాలు సైతం పగిలిపోయాయి. సమీపంలోని చిన్న భవనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఉగ్రదాడిలో 95 మంది ప్రాణాలు కోల్పోయారని, 151 మంది గాయపడ్డారని అఫ్గాన్‌ వైద్య శాఖ ప్రతినిధి వహీద్‌ చెప్పారు.

అవయవాలు తెగిపడి, రక్తమోడుతున్న క్షతగ్రాతులతో కాబూల్‌లోని జమూరియతే ఆసుపత్రి నిండిపోయింది. ఇటాలియన్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డేజన్‌ మాట్లాడుతూ.. 131 మంది క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. పేలుడు ప్రాంతానికి సమీపంలోని షాపు యజమాని అమినుల్లా ఆ భీతావహ పరిస్థితిని వెల్లడిస్తూ‘మా బిల్డింగ్‌ ఊగిపోయింది. కిటికీ అద్దాలన్నీ పగిలిపోయాయి. మార్కెట్‌లోని ప్రజలంతా షాక్‌లో ఉన్నాం’ అని చెప్పారు. ‘పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు, అనేక మంది గాయపడ్డారు. రక్తపు మడుగులు ప్రవహించాయి’ అని మరో వ్యక్తి పేర్కొన్నాడు.

పోలీసుల కళ్లుగప్పి..
నిరంతరం భారీ భద్రత నడుమ ఉండే ప్రాంతంలోనే పేలుడు జరగడంతో కాబూల్‌ ఉలిక్కిపడింది. పేలుడు సంభవించిన ప్రాంతానికి సమీపంలో అంతర్జాతీయ సంస్థలు, విదేశీ రాయబార కార్యాలయాలు, మంత్రిత్వ శాఖల భవనాలు ఉన్నాయి. ‘ఆస్పత్రికి రోగిని తీసుకెళ్తున్నట్లుగా నటిస్తూ అంబులెన్స్‌ డ్రైవర్‌ వీధి ప్రారంభంలోని మొదటి చెక్‌పోస్టులో తనిఖీ లేకుండానే ముందుకెళ్లాడు. 

రెండో చెక్‌ పాయింట్‌ వద్ద పోలీసులు అంబులెన్స్‌ను ఆపేందుకు ప్రయత్నించగా వేరే దారిలోకి డ్రైవర్‌ వాహనాన్ని మళ్లించాడు. పోలీసులు అంబులెన్స్‌కు అడ్డుపడడంతో.. పేలుడు పదార్థాలతో నిండిన ఆ వాహనాన్ని డ్రైవర్‌ పేల్చేశాడు’ అని హోం శాఖ ప్రతినిధి నస్రత్‌ తెలిపారు. ఈ దాడిని నాటోతో పాటు, అమెరికా, బ్రిటన్‌ సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. కాబూల్‌ ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండిస్తూ.. సూత్రధారుల్ని, వారి మద్దతుదారుల్ని చట్టం ముందు నిలబెట్టాలని విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.


                         తీవ్రంగా గాయపడిన చిన్నారి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top