ఆశ్రయానికి నో.. రెండు కోట్లు ఇచ్చేందుకు ఓకే! | Sakshi
Sakshi News home page

ఆశ్రయానికి నో.. రెండు కోట్లు ఇచ్చేందుకు ఓకే!

Published Tue, May 31 2016 2:09 PM

ఆశ్రయానికి నో.. రెండు కోట్లు ఇచ్చేందుకు ఓకే!

లండన్: శరణార్థులను తమ గ్రామంలోకి అనుమతివ్వకుండా అందుకు ప్రతిగా కోట్ల రూపాయల ఫైన్ చెల్లించేందుకు స్విట్జర్లాండ్ లోని ఓ గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.1,96,17,606 వారికి చెల్లిస్తామని ప్రకటించారు. డబ్బు అయితే, వారి జీవనోపాధికి పనికొస్తుందని ఆ గ్రామ అధికారి ప్రకటించాడు. మొత్తం 50 వేల మంది సిరియా ప్రాంతానికి చెందిన శరణార్థులను తమ దేశంలోకి అనుమతించేందుకు స్విట్జర్లాండ్ నిర్ణయించింది.

అందులో భాగంగా ఆయా గ్రామాల్లో వారిని సర్దేందుకు గ్రామానికి పదిమంది చొప్పున నిర్ణయించారు. అంతకంటే ముందు ఆ గ్రామంలో శరణార్ధులపై అభిప్రాయ సేకరణ చేస్తారు. అందులో భాగంగా దాదాపు 300మంది మిలియనీర్లు, 20,000మంది జనాభాతో ఉన్న స్విట్జర్లాండ్ లోని ''లీలి' అనే గ్రామంలో అభిప్రాయ సేకరణ చేపట్టగా వారు శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరించి డబ్బు సహాయం చేస్తామని చెప్పారు. ఒక వేళ తాము ఆశ్రయం ఇస్తే అలాగే ఇతరులు కూడా ఆశపడి తమ గ్రామానికి వస్తారని, అలా కాకుండా డబ్బు సహాయం చేయడం ద్వారా శరణార్థి శిబిరాల్లో ఉంటున్న వారికి భవిష్యత్ అందించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. వారి భాష తీరు కూడా వేరని, పిల్లల చదువులు వంటి సమస్యలు వస్తాయని తెలిపారు.

Advertisement
Advertisement