ప్రధాని హత్య.. 34 ఏళ్ల తర్వాత కేసు క్లోజ్‌

Sweden closes PM Olof Palme murder case - Sakshi

స్టాక్‌హోమ్‌ : 34 ఏళ్ల తర్వాత స్వీడన్‌ మాజీ ప్రధాని ఓలోఫ్ పామ్ హత్య కేసు చిక్కుముడిగానే ముగిసింది. 1986, ఫిబ్రవరి 28న స్టాక్‌హోమ్‌లో తన సతీమణి లిస్బెట్‌తో కలిసి సినిమాకి వెళ్లి తిరిగి వస్తుండగా ఓలోఫ్‌ హత్యకు గురయ్యారు. ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఓలోఫ్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ నేత అయిన ఓలోఫ్‌ హత్యపై ఎన్నో కుట్ర సిద్ధాంతాలు, ఊహాగానాలు మూడు దశాబ్ధాలుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టంచిన నాటి దేశ ప్రధాని హత్యకేసును ఛేదించడం స్వీడన్‌ పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. (జార్జ్‌ ఫ్లాయిడ్‌ సోదరుడి ఆవేదన)

ఈ కేసులో 90 వేల మందిని ప్రాథమికంగా విచారించగా, దాదాపు 10వేల మందిని పోలీసులు ఇంటర్యూలు చేశారు. 134 మందిని అనుమానితులుగా గుర్తించారు. దాదాపు 4000 వాహనాల వివరాలను దర్యాప్తులో భాగంగా సేకరించారు. ప్రధాని శరీరంలోని బుల్లెట్‌, గాయపడిన అయన భార్య శరీరంలోని బుల్లెట్‌లను స్వీడన్‌, జర్మనీ, అమెకాలోని ఎఫ్‌బీఐ ల్యాబొరెటరీల్లో పరీక్షించినా ఎలాంటి లీడ్‌ లభించలేదు. (పొరపాటున చేప మీద కూర్చున్నాడంతే!)

ఈ కేసు విషయమై స్వీడన్ చీఫ్ ప్రాసిక్యూటర్ క్రిస్టర్ పీటర్సన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘స్టిగ్ ఎంగ్‌స్ట్రోమ్ అనే వ్యక్తి ఒంటరిగా ఈ హత్య చేశాడని నమ్ముతున్నాము. అయితే దానిని నిరూపించడానికి తగినన్ని ఆధారాలు లేవు. స్టిగ్ ఎంగ్‌స్ట్రోమ్ మరణించినందున, అతనిపై అభియోగాలు మోపలేము, అందుకే దర్యాప్తును నిలిపివేయాలని నిర్ణయించుకు‍న్నాము. నా అభిప్రాయం ప్రకారం, స్టిగ్ ఎంగ్‌స్ట్రోమ్ ప్రధాన నిందితుడు. 34 ఏళ్ళ తర్వాత దర్యాప్తులో మాకు కొత్త విషయాలు తెలియడం కష్టం. అందుకే మేము ఊహించినంత వరకు ఓ అంచనాకు వచ్చాము. స్టిగ్ ఎంగ్‌స్ట్రోమ్ 2000 సంవత్సరంలో మరణించాడు. ఎంగ్‌స్ట్రోమ్ దోషి అనడానికి సూచించే అనేక అంశాలు ఉ‍న్నాయి. ప్రస్తుత బృందం 34 ఏళ్ల కిందట దర్యాప్తు చేసినట్టయితే, నాడు అతని కదలికలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోతే రిమాండ్‌కు తరలించే వాళ్లం. అతన్ని అరెస్ట్‌ చేయడానికి తగినన్ని ఆధారాలు సంపాధించేవాళ్లమని అనుకుంటున్నాము’ అని క్రిస్టర్ పీటర్సన్ పేర్కొన్నారు.  

‘స్వీడన్‌ చరిత్రలోనే ఇది అతిపెద్ద నేరపరిశోధన కేసు. కొన్ని సార్లు ఈ కేసును అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్‌ కెన్నెడీ హత్య కేసుతో పోల్చుతుంటారు. ఓలోఫ్ పామ్ హత్యానంతరం వచ్చిన ఎ‍న్నో కుట్ర సిద్ధాంతాలపైన కూడా దర్యాప్తు చేశాము, కానీ వాటిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. విచారణాధికారులుగా కొత్త టీమ్‌ను రిక్రూట్‌ చేసిన తర్వాత, కేసు పూర్వాపరాలను, అనుమానితుల జాబితాను తిరగదోడారు. మా విచారణలో ఎంగ్‌స్ట్రోమ్ పలుమార్లు ఇచ్చిన వాంగ్మూలాల్లో తేడాలను స్పష్టంగా గమనించాము. అనంతరం 2017లో ప్రధాని హత్య కేసులో అతడే ముఖ్య సూత్రధారిగా నిర్ధారణకు వచ్చాము’ అని విచారణాధికారి మెలాండర్‌ అన్నారు. 

హత్య జరిగిన సమయంలో దర్యాప్తుకు ఎంగ్‌స్ట్రోమ్ కేంద్ర బిందువు కాదని పీటర్సన్ చెప్పారు. ‘కానీ అతని నేపథ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే అతను ఆయుధాలకు వాడిన చరిత్ర ఉంది. మిలిటరీలో కూడా పనిచేశాడు. అతడికి పలు షూటింగ్ క్లబ్బుల్లో కూడా సభ్యత్వం ఉన్నట్టు తెలిసింది’ అని పీటర్సన్ అన్నారు. అంతేకాకుండా సన్నిహితుల వద్ద తరుచూ ప్రధానమంత్రిని, అతని విధానాలను చాలా విమర్శించేవాడని పీటర్సన్ చెప్పారు. హత్య జరిగిన వీధిలోని, స్వెవాజెన్‌లోని తన కార్యాలయంలో ఆలస్యం అవ్వడంతో అక్కడే ఉన్నానని ఎంగ్‌స్ట్రోమ్ చెప్పారని, అయితే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన కిల్లర్‌ పోలీకలతో అతని పోలీకలు సరితూగుతున్నాయన్నారు. దీంతో దాదాపు 34 ఏళ్లుగా దర్యాప్తు చేస్తున్న స్వీడన్‌ పోలీసులు చివరకు సాక్ష్యాలతో కాకుండా అంచనాలతోనే ఈ కేసును క్లోజ్‌ చేశారు.

(ఎంగ్‌స్ట్రోమ్ ఫైల్‌ ఫోటో)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top