నేపాల్‌ ప్రధానికి అండగా ఇమ్రాన్‌ ఖాన్‌!?

Sources Says Imran Khan Proposed Phone Call To Nepal PM KP Sharma Oli - Sakshi

భారత్‌పై నేపాల్‌ ప్రధాని తీవ్ర ఆరోపణలు

ఇస్లామాబాద్‌/ఖాట్మండూ: సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలికి పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతు ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఓలికి పదవీ గండం పొంచి ఉన్న నేపథ్యంలో ఆయనకు బాసటగా నిలిచేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌పై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఓలితో ఇమ్రాన్‌ ఖాన్‌ గురువారం మాట్లాడనున్నారని ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఈ మేరకు రేపు మధ్యాహ్నం(నేపాల్‌ కాలమానం ప్రకారం 12.30 గంటలకు) ఫోన్‌ కాల్‌ ఫిక్స్‌ చేయమని నేపాల్‌ విదేశాంగ శాఖను పాక్‌ కోరినట్లు వెల్లడించింది. కాగా నేపాల్‌ అధికార కమ్యూనిస్టు పార్టీకి చెందిన కేపీ శర్మ ఓలి భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.(చైనాకు మద్దతు పలికిన నేపాల్‌, పాక్‌)

భారత్‌పై ఓలి తీవ్ర ఆరోపణలు
ఈ క్రమంలో సుదీర్ఘ కాలం నుంచి మిత్రదేశంగా ఉన్న భారత్‌లోని వ్యూహాత్మక భూభాగాలైన లిపులేఖ్‌, లింపియధుర, కాలాపానీలను నేపాల్‌లో కలుపుతూ.. రాజ్యాంగ సవరణ చేసి ఓలి ప్రభుత్వం కొత్త మ్యాపులు రూపొందించింది. అంతేగాకుండా బిహార్‌ సరిహద్దులోనూ కయ్యానికి కాలు దువ్వింది. అంతేగాక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనా, ఇటలీ కంటే భారత్‌ నుంచి వచ్చే వైరస్‌ చాలా ప్రమాదకరమైనదని, నేపాల్‌లో కోవిడ్‌ కేసులు పెరగడానికి భారత్‌ నుంచి వచ్చే వాళ్లే కారణమని ఓలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నుంచే ఆయనపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

దీంతో తనను ప్రధాని పదవి నుంచి తనను దింపేందుకు భారత్‌ కుట్ర చేస్తోందని ఓలి ఆరోపణలకు దిగగా.. పార్టీ చైర్మన్‌ ప్రచండ(పుష్ప కమల్‌ దహల్‌) మంగళవారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా నేపాల్‌కు అండగా ఉంటున్న మిత్రదేశం భారత్‌పై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపని పక్షంలో ప్రధాని పదవికి ఓలి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలోని పలువురు ముఖ్య  నేతలు సైతం ప్రచండ వ్యాఖ్యలను సమర్థించారు. (‘సొంత పార్టీలో సెగ.. ప్రధాని రాజీనామాకు పట్టు’)

డ్రాగన్‌ హస్తం..
ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌.. ఓలికి మద్దతు పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్నాళ్లుగా చైనాతో స్నేహం పెంచుకుంటున్న ఓలిని పాక్‌ సమర్థించడం, భారత్‌కు వ్యతిరేకంగా ఓలి వ్యాఖ్యలు చేయడం వెనుక డ్రాగన్‌ హస్తం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కాగా పాక్‌ చైనా మిత్రదేశంగా కొనసాగుతుండగా.. నేపాల్‌ సైతం ఇటీవల చైనాతో సంబంధాలు బలోపేతం చేసుకుంటోంది.హాంకాంగ్‌లో డ్రాగన్‌ ప్రవేశపెట్టిన వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని అమెరికా సహా పలు ప్రపంచ దేశాలు విమర్శిస్తుండగా నేపాల్‌, పాకిస్తాన్‌ మాత్రం వత్తాసు పలకడం విశేషం. అదే విధంగా నేపాల్‌ సరిహద్దు గ్రామాలు చైనా ఆధీనంలో ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆ దేశ పాలకులు నోరు మెదకపోవడం గమనార్హం. ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే పాక్‌తో పాటు నేపాల్‌ ప్రధానిని కూడా డ్రాగన్‌ తన గుప్పిట్లోకి తెచ్చుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  (చైనా మరో ఎత్తుగడ.. బంగ్లాదేశ్‌తో బంధం!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top