పర్యాటకం; విదేశీయులకు సౌదీ వెసలుబాటు!

Saudi Reforms Row Allows Foreign Men And Women Share Hotel Room Together - Sakshi

రియాద్‌ : యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నేతృత్వంలోని సౌదీ అరేబియా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా విదేశీ టూరిస్టులకు వీసా జారీ చేయనున్న ముస్లిం రాజ్యం... వారికి మరిన్ని వెసలుబాట్లు కల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ టూరిస్ట్ వీసాల కోసం 49 దేశాల పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్న సౌదీ... తాజాగా తమ దేశ పర్యటనకు వచ్చే విదేశీ మహిళలు, పురుషులు సంయుక్తంగా హోటల్‌ గదుల్లో బస చేయవచ్చని తెలిపింది. అదే విధంగా వాళ్లు బంధువులు కాకపోయినా తమకేమీ అభ్యంతరం లేదని పేర్కొంది. అంతేగాకుండా సౌదీ మహిళలు కూడా తమ బంధువులతో కలిసి లేదా ఒంటరిగానైనా బస చేసేందుకు హోటల్‌ గదులను బుక్‌ చేసుకునే వీలు కల్పిస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు... ‘ రూంలు బుక్‌చేసుకున్న సౌదీ జాతీయులు తమ కుటుంబ గుర్తింపు కార్డు చూపించి హోటల్‌లో బస చేయవచ్చు. అయితే విదేశీ పర్యాటకులకు ఈ నిబంధన వర్తించదు. విదేశీ పురుషులు లేదా మహిళలు విడివిడిగా గానీ, సంయుక్తంగా గానీ హోటల్‌లో దిగవచ్చు’ అని సౌదీ కమిషన్‌ ఫర్‌ టూరిజం అండ్‌ నేషనల్‌ హెరిటేజ్‌ శాఖ ప్రకటన విడుదల చేసినట్లు వార్తా సంస్థ ఒకాజ్‌ వెల్లడించింది. (చదవండి : పొరుగింటి మీనాక్షమ్మను చూశారా!)

కాగా కట్టుబాట్లకు మారుపేరైన సౌదీలో గత కొంతకాలంగా ఆహ్వానించదగ్గ మార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. విజన్‌ 2030 కార్యక్రమంలో భాగంగా సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ సామాజిక ఆంక్షలను సడలిస్తున్నారు. అదే విధంగా మహిళల పట్ల కూడా సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇక సౌదీకి చెందిన లేదా విదేశీయులైన పరిచయం లేని అమ్మాయి, అబ్బాయి కలిసి బయటికి వస్తే బహిరంగంగానే కఠిన శిక్షలు అమలుచేసేవారన్న సంగతి తెలిసిందే. అయితే బిన్‌ ఆదేశాలతో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే దిశగా తాజాగా సౌదీ ప్రభుత్వం ఈ నిబంధనలకు చరమగీతం పాడింది. 2030 నాటికి సుమారు 100 మిలియన్ల మంది విదేశీ పర్యాటకులు సౌదీని సందర్శించడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక పెళ్లికి ముందు శృంగారాన్ని తీవ్ర నేరంగా పరిగణించే సౌదీ ప్రభుత్వం.. దానిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top