ఫ్లయింగ్‌ ష్యాషన్‌ షో...!

Saudi Conduct Flying Fashion Show With Drones - Sakshi

అక్కడ మోడళ్లు లేకుండానే ఆకర్షణీయమైన, రంగు రంగుల దుస్తులు తమ ‘ఫ్యాషన్‌ పరేడ్‌’ను తామే నిర్వహించాయి. సంప్రదాయ ఫ్యాషన్‌షోలకు భిన్నంగా డ్రోన్లు మోడళ్ల పాత్ర పోషించి ర్యాంప్‌పై నడిచాయి. ఇదంతా ఎక్కడో నూతన పోకడలు, కొత్త ఫ్యాషన్లకు పుట్టిళ్ల వంటి మిలాన్, న్యూయార్క్, పారిస్‌ నగరాల్లో జరిగిందనుకుంటే మీరు పొరబడినట్టే...ఇంకా మహిళలపై ఆంక్షలు అమలయ్యే, స్త్రీలకు సంపూర్ణహక్కులు కొరవడిన సౌదీ అరేబియాలో ఇలాంటి వినూత్నమైన ప్రయోగం జరిగింది. ఇటీవల జెద్దాలోని హిల్టన్‌ హోటల్‌లో జరిగిన ఈ ప్రదర్శనను ‘ఫ్యాషన్‌ హౌస్‌’గా పిలుస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఇలాంటి నవతరం టెక్నాలజీకి ఊతమిచ్చేందుకు ఈ షో నిర్వహించారు.

అల్‌జవాహర్జీ అనే డిజైనర్‌ దీని వెనక సాగించిన కృషి వల్ల ఇది సాధ్యమైంది.  రంజాన్‌ మాసం పవిత్రతకు భంగం కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇంతవరకున్న భావనలకు భిన్నంగా  సౌదీ అరేబియాలో గత ఏప్రిల్‌లో జరిగిన ఫ్యాషన్‌వీక్‌లో మహిళలుపాల్గొనేందుకు అనుమతినిచ్చారు. మొదట ముస్లిం మహిళలు ధరించే బురఖాను పోలిన ‘నల్లటి అబయ’ను, రెండో ఐటెంగా నల్లటి హ్యాంగర్‌కు తగిలించిన పొడవైన ‘ఆకుపచ్చ కుర్తా’  (దానితోపాటు« ధరించే నెక్లెస్‌తో సహా), మూడో వస్తువుగా  స్ట్రాపులతో ఉన్న ప్రింటెడ్‌ డ్రస్‌ ప్రదర్శించారు. ఈ మూడు ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలో అక్కడి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి వేలాది వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి.

గత ఫిబ్రవరిలో ఇటలీకి చెందిన ఫ్యాషన్‌ హౌస్‌ ‘డాల్స్‌ అండ్‌ గబానా’ బ్రాండ్‌ హ్యాండ్‌బ్యాగ్‌లను  డ్రోన్ల ద్వారా ప్రదర్శించింది. ఇలాంటి షోలను నిర్వహించడం సాంకేతికంగా సమస్యలతో కూడుకున్నదే. డ్రోన్ల సిగ్నళ్లకు అంతరాయం కలగని విధంగా అతిథుల ఫోన్లలో వైఫైను ఆపేయాలంటూ ముందుగా విజ్ఞప్తిచేశారు. దాదాపు గంట పాటు అయోమయ పరిస్థితులు కొనసాగాక, చివరకు ఈ షో మొదలైంది. డ్రోన్ల ద్వారా హ్యాడ్‌బ్యాగ్‌ల మోడలింగ్‌ వీడియోలు ఆ తర్వాత ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేశాయి. 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top