రష్యా–బ్రిటన్‌ మధ్య ముదిరిన దౌత్య యుద్ధం

Russia ramps up diplomatic tensions, expels more UK envoys - Sakshi

మాస్కో: రష్యా మాజీ గూఢచారిపై హత్యాయత్నం నేపథ్యంలో బ్రిటన్, రష్యాల మధ్య నెలకొన్న దౌత్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. తమ సిబ్బందిని బహిష్కరించినందుకు ప్రతిగా మరో 50 మంది దౌత్య ప్రతినిధుల్ని తగ్గించుకోవాలని బ్రిటన్‌కు రష్యా స్పష్టం చేసింది. బ్రిటన్‌లో నివసిస్తున్న రష్యా మాజీ ఏజెంట్‌ సెర్గె స్క్రిపాల్, అతని కుమార్తె యులియాపై విష ప్రయోగం తర్వాత బ్రిటన్, దాని మిత్రదేశాలు తమ దేశాల్లోని రష్యా దౌత్య సిబ్బందిని పెద్ద ఎత్తున బహిష్కరించిన సంగతి తెల్సిందే.

ప్రతిగా రష్యా ఇప్పటికే 23 మంది బ్రిటన్‌ ప్రతినిధుల్ని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించగా.. తాజాగా మరో 50 మంది సిబ్బందిని వెనక్కి పిలిపించాలని కోరింది. మాస్కోలోని బ్రిటిష్‌ రాయబారిని తన కార్యాలయానికి పిలిపించుకున్న రష్యా విదేశాంగ శాఖ ఎంతమంది రష్యా ప్రతినిధుల్ని బహిష్కరించారో అంతే సంఖ్యలో బ్రిటన్‌ తన సిబ్బందిని తగ్గించుకోవాలని తేల్చిచెప్పింది. 23 దేశాల రాయబారులకు ఆ దేశాల దౌత్య సిబ్బంది రష్యా విడిచి వెళ్లాలని ఆదేశించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top