కుల్‌భూషణ్‌ జాదవ్‌కు మరణ శిక్ష నిలిపివేత

Relief To Kulbhushan As Icj Stays His Death Punishment - Sakshi

హేగ్‌ : అంతర్జాతీయ న్యాయస్ధానం(ఐసీజే)లో కుల్‌భూషణ్‌ జాదవ్‌కు భారీ ఊరట లభించింది. గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పాక్‌ సైనిక కోర్టు కుల్‌భూషణ్‌ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని ఐసీజే బుధవారం తీర్పు వెలువరించింది.  కుల్‌భూషణ్‌కు తమ నిఘా విభాగంతో సంబంధం లేదని భారత్‌ వాదించింది. గూఢచర్యం కేసులో 2016 మార్చిలో కుల్‌భూషణ్‌ను పాకిస్తాన్‌ అరెస్ట్‌ చేసింది. 2017 ఏప్రిల్‌లో జాదవ్‌కు పాక్‌ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన భారత్‌ పదునైన వాదన వినిపించడంతో సానుకూల తీర్పు వెలువడింది. 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది న్యాయమూర్తులు భారత్‌ వాదనతో ఏకీభవించారు. కేసును పునసమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్ధానం పాకిస్తాన్‌కు సూచించింది.


న్యాయస్థానం తీర్పుపై కేంద్ర మాజీమంత్రి సుష్మా స్వరాజ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత్‌ విజయమని ఆమె అభివర్ణించారు. తీర్పును స్వాగతించిన సుష్మా స్వరాజ్‌...ఐసీజే ఎదుట భారత్‌ తరఫు న్యాయవాది హరీశ్‌ సాల్వే ప్రభావవంతంగా వాదించారని, భారత్‌కు విజయం అందించిన ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, ఇరాన్‌లో వ్యాపారం చేసే భారత నౌకాదళ మాజీ అధికారి అయిన జాధవ్‌ను పాక్‌ ఉద్దేశపూర్వకంగా అపహరించినట్టు భారత్‌ ప్రకటించింది. అంతర్జాతీయ ఒప్పందాలను, తీర్మానాలను ఉల్లంఘించిన ఆ దేశంపై ఐసీజేలో పిటిషన్‌ దాఖలు చేసింది. జాధవ్‌ మరణ శిక్షను రద్దు చేయాలని, తక్షణమే ఆయనను విడుదల చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో తుది తీర్పు వెలువడే వరకూ శిక్షను నిలుపుదల చేయాల్సిందిగా ఐసీజే పాక్‌ను గతంలో ఆదేశించింది. 2017 డిసెంబరులో జాధవ్‌ను కలిసేందుకు వెళ్లిన ఆయన తల్లిని, భార్యను భయపెట్టే విధంగా పాకిస్థాన్‌ వ్యవహరించినట్టు అప్పట్లో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విమర్శించింది. వారిద్దరి చేత బలవంతంగా దుస్తులు మార్పింపచేయడం, మాతృభాషలో మాట్లాడేందుకు అనుమతించకపోవడం వంటి చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top