గిఫ్ట్స్‌ వద్దు.. ఛారిటీ ముద్దు

Prince Harry Meghan Markle Say No GIfts Give Aid To Charity - Sakshi

లండన్‌ : ప్రపంచం అంతా ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హారీ, మేఘన్‌ మార్కెల్‌ల వివాహం గురించి. మే 19న విండ్సోర్‌లో వివాహంతో ఒక్కటవనున్న ఈ జంట తమ వివాహవేడుకకు హజరయ్యే అథిదులకు ఒక విన్నపం చేసింది. అదేంటంటే తమ వివాహానికి వచ్చేవారు బహుమతులు తేవద్దని, ఆ మొత్తాన్ని ముంబైలోని ‘మైనా మహిళ ఫౌండేషన్‌’కు విరాళంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. వివాహ వేడుక సందర్భంగా ఈ జంట కొన్ని సంస్థలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకుగాను కొన్ని సేవా సంస్థలను ఎన్నుకున్నారు. ఇవన్నీ మహిళా సాధికరత, సామాజిక మార్పు, పర్యావరణ మార్పు, ఎయిడ్స్‌ బాధితులు, నిర్వాసితులు, సాయుధ దళాలు, క్రీడలు, అనాథల కోసం పనిచేసే సంస్థలు.

ఈ విషయం గురించి కెన్సింగ్‌టన్‌ రాజ ప్రసాదం అధికారులు మాట్లాడుతూ ఇవన్ని చాలా చిన్నసంస్థలు వీటికి, ప్రిన్స్‌ హారీ జంటకు ఎటువంటి అధికారిక సంబంధాలు లేవని ప్రకటించారు. కేవలం ఆ సంస్థల​కు సహాయం చేయడం కోసమే వీటిని ఎంపిక చేసుకున్నారని వెల్లడించారు. వీటిల్లో మన దేశంలోని ముంబైకి చెందిన ‘మైనే మహిళ ఫౌండేషన్‌’  ఒకటి. మేఘన మార్కెల్‌ గత ఏడాది ఈ ఫౌండేషన్‌ను సందర్శించారు. ఈ ఫౌండేషన్‌ వారు మహిళలకు ఉపాధి కల్పించడం కోసం కృషి చేస్తుంది. అందుకుగాను ఈ సంస్థ మహిళలకు సానీటరీ నాపికిన్‌ల తయారీలో శిక్షణ ఇస్తుంది. దీనివల్ల మహిళలకు ఉపాధితో పాటు వ్యక్తిగత శుభ్రత గురించి కూడా వారికి సమాచారం అందించే వీలు కలుగుతుంది. ఈ సంస్థ చేసిన కృషి ఫలితంగా పాఠశాలల్లో ఆడపిల్లల డ్రాపవుట్స్‌ కూడా తగ్గాయి.

ఈ సంస్థవారు కేవలం సానీటరి పాడ్‌ల తయారీ గురించి మాత్రమే కాక గణితం, ఆంగ్లం, మహిళల ఆరోగ్యం, ఆత్మ రక్షణ వంటి అంశాల్లో కూడా మహిళలకు శిక్షణ ఇస్తుంది. ప్రిన్స్‌ హారీ - మేఘన జంట తమ వివాహ సందర్భంగా మా ఈ సంస్థను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. వీరి సహాయంతో మేము మా సంస్థ సేవలను మరిన్ని మురికి వాడలకు విస్తరించే అవకాశం లభిస్తుందని సంస్థ స్థాపకురాలు సుహాని జలోతా హర్షం వ్యక్తం చేశారు. సుహానీ 2015లో మైనే మహిళా ఫౌండేషన్‌ను స్థాపించారు. ముంబై మురికి వాడల మహిళలకు ఉపాధి కల్పనతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశారు. మైనే మహిళ ఫౌండేషన్‌తో పాటు మరో ఆరు సంస్థలను ఈ జంట ఎంపిక చేసుకున్నారు. అవి క్రైసిస్‌, స్కాటీస్‌ లిటిల్‌ సోల్జర్స్‌, స్ట్రీట్‌ గేమ్స్‌, సర్ఫర్స్‌ ఎగెనెస్ట్‌ సెవేజ్‌, సీహెచ్‌ఐవీఏ, వైల్డరనెస్‌ ఫౌండేషన్‌ యూకే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top