భారీ పేలుడు.. ఏమైందో తెలుసా? | pipeline explosion destroys cars and windows in ukraine | Sakshi
Sakshi News home page

భారీ పేలుడు.. ఏమైందో తెలుసా?

May 30 2017 5:04 PM | Updated on Sep 5 2017 12:22 PM

భారీ పేలుడు.. ఏమైందో తెలుసా?

భారీ పేలుడు.. ఏమైందో తెలుసా?

అది ఉక్రెయిన్ రాజధాని కియెవ్ నగరం. అంతా నిశ్భబ్దంగా ఉంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏదో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది.

అది ఉక్రెయిన్ రాజధాని కియెవ్ నగరం. అంతా నిశ్భబ్దంగా ఉంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏదో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. అపార్టుమెంట్లలోని ఏడో అంతస్తులో ఉన్న కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి. భూమి బద్దలైంది. కార్లు గాల్లోకి లేచాయి. విపరీతంగా దుమ్ము వ్యాపించింది. ఏదో బాంబు పేలిందని అనుకున్నారు. తీరా చూస్తే.. అక్కడ ఓ మంచినీటి పైప్‌లైన్ పగిలింది. భూగర్భంలో ఉన్న పైప్‌లైన్ ఉన్నట్టుండి పెద్దగా శబ్దం చేస్తూ పగలడంతో నీళ్లు ఉవ్వెత్తున లేచాయి. దాంతోపాటే రోడ్డు కూడా పగిలిపోయింది, అక్కడున్న కార్లు గాల్లోకి లేచాయి, కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఇదంతా అక్కడకు దగ్గరలో ఉన్న ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రోడ్డు దానంతట అదే కదులుతూ పెద్ద పేలుడు, దాంతోనే భారీగా బురద వచ్చినట్లు ఆ ఫుటేజిలో కనిపించింది.

ఆ ఉత్పాతానికి కొద్ది సెకన్ల ముందు అక్కడే ఫుట్‌పాత్ మీద ఒక మహిళ ఫోన్లో మాట్లాడుతూ వెళ్లడం కనిపించింది గానీ, దాని తర్వాత ఆమె ఏమైందో తెలియలేదు. ఆ తర్వాత వీధులలో కూడా మట్టితో కూడిన నీరు ప్రవహించింది. పై అంతస్తులో ఉన్న ఓ వ్యక్తి ఏం జరిగిందో తెలియక బయటకు వచ్చి ఆ నీళ్లు చూసి షాకవడం కూడా కనిపించింది. ఆ వీడియో వెంటనే పలు సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ అయింది. ఏడో అంతస్తు వరకు కూడా మట్టి నీళ్లు వెళ్లాయని, ఆ నీళ్లతో పాటు ఇసుక కూడా వచ్చిందని రెడిట్ యూజర్ ఒకరు కామెంట్ చేశారు. నీటిపైపు పేలుడు వల్ల చుట్టుపక్కల ఉన్న కార్ల అద్దాలు పగిలిపోయాయి. వాటి మీద విపరీతంగా బురద పేరుకుపోయింది. అసలు ఆ పేలుడు ఎందుకు సంభవించిందీ ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఇందులో ఎవరూ గాయపడినట్లు మాత్రం సమాచారం అందలేదని అక్కడి పాత్రికేయులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement