అక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేస్తారంటే!

People Locked in Cages Beaten Shamed Over COVID 19 Lockdown - Sakshi

లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం చేసిన పలు దేశాలు

మండిపడుతున్న మానవ హక్కుల సంఘాలు

న్యూఢిల్లీ: మానవాళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మహమ్మారిని అంతం చేసే పరిశోధనలకు నిధులు కేటాయిస్తూనే.. అంటువ్యాధి ప్రబలకుండా లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి. కేవలం నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లే వెసలుబాటును కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగానే లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తూ పోలీసుల చేతికి చిక్కుతున్నారు. ఇలాంటి వారి కారణంగా అత్యవసర సేవల నిమిత్తం రోడ్ల మీదకు వచ్చిన ప్రజలపై కూడా పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. అందరినీ ఒకే గాటన కట్టి విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మానవ హక్కుల సంఘాలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక్కో దేశంలో పౌరుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతున్నాయి.

అతడిని సస్పెండ్‌ చేశాం
భారత్‌లో మార్చి 24 నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. ఇక ఆనాటి నుంచి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. కరోనా వ్యాప్తి అరికట్టే చర్యల్లో భాగంగా లాఠీలకు పనిచెబుతున్నారు. మరికొన్ని చోట్ల గుంజీలు తీయిస్తూ.. వీధుల వెంట పరిగెత్తిస్తూ.. కొడుతున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో ఓ పోలీసు మరో అడుగు ముందుకేసి పౌరుడి నుదటిపై.. ‘‘నేను లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించాను. నాకు దూరంగా ఉండండి’’అంటూ రాతలు రాయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో అతడిపై వేటు వేసినట్లు ఓ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు.(లాక్‌డౌన్‌: ఇది అమానవీయ చర్య: ప్రియాంక)
 
రబ్బరు బుల్లెట్ల వర్షం
ఇక దక్షిణాఫ్రికాలో శుక్రవారం నాటి నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించారు. దీనిని పక్కాగా అమలు చేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాటర్‌ కెనన్లు, రబ్బరు బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ ఇష్టారీతిన చితకబాదుతున్నారు.(అక్కడ 5 మరణాలు.. భారత సంతతి వైరాలజిస్టు మృతి)

ఫిలిప్పీన్స్‌లో ఏం చేస్తున్నారంటే‌...
లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఫిలిప్పైన్స్‌లో అరెస్టు చేసి.. హింస పెడుతున్నారంటూ మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. తీవ్రమైన నేరస్తుల్లా చిత్రీకరించి సమాజంలో తలెత్తుకోకుండా చేస్తున్నారని మండిపడుతున్నాయి. ముఖ్యంగా యువతను కుక్కల బోన్లలో బంధించడం.. ఎర్రటి ఎండలో కూర్చోబెట్టడం వంటి అమానుష చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ అమలు అవుతున్న క్రమంలో ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తు మహమ్మారిని వ్యాప్తి చేస్తున్న వారిని కాల్చి చంపేందుకు కూడా వెనుకాడవద్దని దేశ అధ్యక్షుడు రోడ్రిగో పోలీసులు, మిలటరీ అధికారులను ఆదేశించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. (గీత దాటితే.. కాల్చి చంపండి)

క్వారంటైన్‌లో ఉండకపోతే.. మెక్సికోలో అంతే..
కరోనా వైరస్‌ సోకిన వారు క్వారంటైన్‌లో ఉండకుండా బయటకు వస్తే మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తామని మెక్సికోలోని యుక్టాన్‌ రాష్ట్రం హెచ్చరించింది. ఇక లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రాంక్‌ కాల్స్‌ చేసి విసిగించిన వారికి 600 డాలర్ల జరిమానా విధిస్తామని పెరూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

హాంగ్‌కాంగ్‌లో కూడా..
సామాజిక దూరం పాటించకుండా.. క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హాంగ్‌కాంగ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో నిబంధనలు అతిక్రమించిన దాదాపు 70 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి విపత్కర సమయాల్లో పిచ్చిగా ప్రవర్తిస్తే సహించేది లేదని.. ఆరు నెలల జైలు శిక్ష.. 25 వేల హాంగ్‌కాంగ్‌ డాలర్ల జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు.

ఇక ఇదే తరహాలో సింగపూర్‌ కూడా సామాజిక దూరం నిబంధలను ఉల్లంఘిస్తే 10 వేల సింగపూర్‌ డాలర్ల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆస్టేలియా సైతం నిబంధనలు అతిక్రమిస్తే 11 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు కట్టాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇందుకు ఎవరూ అతీతులు కాదని.. జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష కూడా ఉంటుందని పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top