అక్కడ 5 మరణాలు.. భారత సంతతి వైరాలజిస్టు మృతి

Indian Origin Virologist Passed Away Corona Virus Complications South Africa - Sakshi

జోహన్నస్‌బర్గ్‌: మహమ్మారి కరోనా వైరస్‌ బారిన పడి భారత సంతతి వైరాలజిస్ట్‌ గీతా రామ్‌జీ(64) దక్షిణాఫ్రికాలో కన్నుమూశారు. ఆమె మరణంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 5కు చేరింది. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా వైద్య పరిశోధక మండలి(ఎస్‌ఏమ్‌ఆర్‌సీ) అధ్యక్షురాలు, సీఈఓ గ్లెండా గ్రే ధ్రువీకరించారు. లండన్‌ నుంచి తిరిగివచ్చిన గీత.. కోవిడ్‌-19 సంబంధిత లక్షణాలతో ఆస్పత్రిలో మృతిచెందినట్లు పేర్కొన్నారు. గీత లేని లోటు ఎవరూ పూడ్చలేరని.. ఇది తమకు తీరని విషాదం అని సంతాపం వ్యక్తం చేశారు. కాగా భారత సంతతికి చెందిన గీతా రామ్‌జీ దక్షిణాఫ్రికా క్లినికల్‌ ట్రయల్స్‌ విభాగం ప్రధాన విచారణాధికారి, ఎస్‌ఏఎమ్‌ఆర్‌సీ హెచ్‌ఐవీ నిరోధక పరిశోధక సంస్థ విభాగం డైరెక్టర్‌గా డర్బన్‌లో సేవలు అందించారు. (అమెరికాలో ఒక్కరోజే 865 కరోనా మరణాలు!)

ఈ క్రమంలో హెచ్‌ఐవీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల ఆరోగ్యం పెంపొందించేందుకు పలు పరిశోధనలు జరిపారు. ఈ నేపథ్యంలో యూరోపియన్‌ డెవలప్‌మెంట్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ పాట్నర్‌షిప్స్‌ సంస్థ ఆమెకు అత్యంత ప్రతిభ గల మహిళా శాస్త్రవేత్త అవార్డును ప్రదానం చేసింది. కాగా దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారత సంతతి ఫార్మాసిస్ట్‌ ప్రవీణ్‌ రామ్‌జీని గీత వివాహం చేసుకున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో గీత అంత్యక్రియలు అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. (అద్భుతం.. మోదీకి థాంక్స్‌: ఇవాంక)

ఇక దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఐదురుగు కరోనా కారణంగా మరణించగా... దాదాపు 1350 మంది దీని బారిన పడ్డారు. ఈ నేపథ్యలో దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు దేశ అధ్యక్షుడు సిరిల్‌ రామాఫోసా ప్రకటించారు. కోవిడ్‌-19 పరిణామాల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు దాదాపు 10 వేల బృందాలు రంగంలోకి దిగాయని.. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నాయని వెల్లడించారు. ఇక కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన సిరిల్‌.. లాక్‌డౌన్‌ను ప్రజలు తీవ్రంగా పరిగణించడం లేదని.. దాని కారణంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top