జంట రాజధాని నగరాన్ని నిర్మించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఇస్లామాబాద్: జంట రాజధాని నగరాన్ని నిర్మించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మార్గల్లా హిల్స్ వద్ద 1,200 కోట్ల డాలర్ల (రూ.76,100 కోట్లు) వ్యయంతో జంట రాజధానిని నిర్మించాలని పాక్ ప్రభుత్వం భావిస్తున్నట్లు గురువారం ‘ది న్యూస్’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది. ఈ కథనం ప్రకారం... కొత్తగా నిర్మించనున్న జంట రాజధానిని ప్రస్తుత రాజధాని ఇస్లామాబాద్‌తో అనుసంధానించేందుకు సొరంగ మార్గాన్ని నిర్మించాలని రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీడీఏ) భావిస్తోంది.
ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశాల మేరకు సీడీఏ ఈ మెగా ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా ఇస్లామాబాద్-రావల్పిండి నగరాల మధ్య రెండు రింగ్ రోడ్లతో పాటు రావల్పిండిలోని రావత్ ప్రాంతంలో విమానాశ్రయం నిర్మించనున్నారు. ఈ మెగా ప్రాజెక్టు త్వరలోనే ఖరారు కానుందని, ఖరారైన వెంటనే ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా దీనిపై ప్రకటన చేయనున్నారని ‘ది న్యూస్’ తెలిపింది. దీనికోసం 25 వేల ఎకరాల స్థల సేకరణ కోసం సీడీఏ సన్నాహాలు ప్రారంభించిందని, సాధ్యమైనంత త్వరగా దీనిని సాకారం చేసేందుకు యుద్ధప్రాతిపదికపై పనులు చేపట్టాల్సిందిగా ప్రధాని షరీఫ్ సీడీఏను ఆదేశించారని వెల్లడించింది.