బ్రెజిల్లో 131 ఏళ్ళ వృద్ధుడు

బ్రెజిల్లో 131 ఏళ్ళ వృద్ధుడు - Sakshi


ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడ్ని బ్రెజిల్ వాసులు గుర్తించారు. ముగ్గురు పిల్లలు, 62 ఏళ్ళ భార్య తో సహా 131 ఏళ్ళ వయసులో జీవిస్తున్న ఆ వృద్ధుడ్ని గిన్నిస్ పుటలకు ఎక్కించాల్సిందిగా స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంతకు ముందు 122 ఏళ్ళ వయసున్న ఫ్రెంచ్ మహిళ జెన్నే కాల్మెంట్ అత్యంత వృద్దురాలిగా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆమె 1997 సంవత్సరంలో మరణించింది. ప్రస్తుతం జపాన్ లో 112 ఏళ్ళ... యసుతారో కోయిడే అతి పెద్ద వయస్కురాలుగా జీవిస్తోంది.



ఉత్తర బ్రెజిల్ ఎకరా లోని సామాజిక భద్రతా కార్మికులు డిసౌజా వయసును ధృవీకరిస్తూ ఫేస్బుక్ లో పెట్టిన పత్రాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. జోవో కోయెల్హో డిసౌజా 1884 మార్చి 10న పుట్టినట్లుగా రికార్డులు చెప్తున్నాయి. అతని జనన ధృవీకరణను, ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టిన సామాజిక కార్యకర్తలు ఆ వృద్ధుడ్ని గిన్నిస్ బుక్ లోకి తేవాలని కోరుతున్నారు. డిసౌజా... యాకర్ కు సుమారు రెండువేల కిలోమీటర్ల దూరంలోని సియారా మెరౌకా నగరంలో జన్మించినట్లు పత్రాల ఆధారంగా తెలుస్తోంది.



డిసౌజాను గిన్నిస్ బుక్ కు ఎక్కించమంటూ విన్నపాలు అందడంతో రాష్ట్ర  ప్రభుత్వం అతని రికార్డులను పరిశీలించమని పిలుపునిచ్చింది. కాగా 62 ఏళ్ళ భార్య, 16 ఏళ్ళ మనవరాలుతో ఆయన నేటికీ జీవిస్తున్నట్లుగా బ్రెజిల్ కు చెందిన పత్రికలు చెప్తున్నాయి.  సెనా మడెరెయిరా నుంచి 30 నిమిషాల పడవ ప్రయాణం అనంతరం వచ్చే యాకర్ రాష్ట్ర మధ్య భాగంలోని అల్కంటారా  ఎస్టిరావో గ్రామంలో వారు నివసిస్తున్నట్లుగా కూడ వారు ధృవీకరించారు. అయితే డిసౌజా వయసు నిజమైనదే అయితే 30 ఏళ్ళ డిసౌజా కుమార్తె  తన తండ్రికి 101 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పుట్టి ఉండాలని ఓ పత్రిక వ్యాఖ్యానించింది.



యాకర్ లోని రబ్బరు వెలికి తీసే పనికి వచ్చినపుడు తన తండ్రి డిసౌజా అతి చిన్న వయసువాడని, ఆయన తమ తల్లితో సుమారు 40 సంవత్సరాలకు పైనుంచి కలిసి జీవిస్తున్నారని,  ఇప్పుడు ప్రతి పనీ ఇతరుల సహాయంతోనే చేస్తున్నారని ఆయన కుమార్తె సిర్లెనే చెప్తోంది. తండ్రి వయసు గురించి వస్తున్న సందేహాలకు తావేలేదని, అక్కడక్కడా ఎక్కువకాలం బతికేవాళ్ళు  ఉంటారనేందుకు ఇంతకు ముందు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని ఆమె చెప్తోంది.  ఇప్పటికే అన్నింటినీ పత్రబద్ధం చేశామని... ఆయా పత్రాలన్నింటినీ నిపుణులు పరిశీలించారని అసాధారణమైన, అసత్యమైన విషయాలేమీ లేనట్లు తేలిందని అంటోంది. ఆరేళ్ళ క్రితం స్ట్రోక్ వచ్చినా ఆయనకు మూడు పూటలా భోజనం చేసే అలవాటుందని సిర్లెనే సౌజా చెప్తోంది. అన్నంతోపాటు చేపలు, మాంసం...అలాగే స్థానికంగా దొరికే బీన్స్ కూర ఆయన ఎంతో ఇష్టంగా తింటారని అంటోంది.



ఆ 131 ఏళ్ళ వృద్ధుడు జీవించే ఉన్నాడని, పెన్షన్ కూడా అందుకుంటుండటంతో ఆయనకు గిన్నిస్ రికార్డులకు ఎక్కే అర్హత ఉందని... ఓ సహోద్యోగి, ప్రజా సేవకుడు డిసౌజాకు సంబంధించిన పత్రాలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. డిసౌజా బతికే ఉన్నాడా లేడా అన్న వివరాలను తెలుసుకునేందుకు  వెళ్ళినపుడు ఆయన సజీవంగా ఉండటం ఎంతో ఆనందం కలిగించిందని కెన్నెడీ అఫోన్సో చెప్తున్నారు. డిసౌజా వివరాలన్నీ నిజమైనవేనని,  భూమిపై అత్యంత ఎక్కువకాలం బతికి ఉన్న మనిషిగా ఆయన గిన్నిస్ రికార్డుకు అప్పీలు చేసేందుకు అర్హుడని కెన్నెడీ అంటున్నారు.  

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top