ఏడ్రోజుల్లో ఎన్నారై వివాహ రిజిస్ట్రేషన్‌

NRI Marriages Need To Be Registered Within 7 Days - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే ఎన్నారై వివాహాలన్నీ ఏడు రోజుల్లోగా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాల్సిందేనని కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ వారం రోజుల్లో రిజిస్టర్‌ చేసుకోని పక్షంలో పాస్‌పోర్టులు, వీసాలు జారీ చేసే అవకాశం ఉండదని పేర్కొంది. గతవారం కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మనేకా గాంధీ ఎన్నారై వివాహాలు కచ్చితంగా రెండ్రోజుల్లోనే రిజిస్టర్‌ అవ్వాలని సూచించారు. అయితే.. ఇలాంటి వివాహాల్లో మహిళలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రుల బృందం (రాజ్‌నాథ్‌ సింగ్, సుష్మా స్వరాజ్, రవిశంకర్‌ ప్రసాద్, మేనకా గాంధీ) సమావేశంలో దీన్ని ఏడురోజులకు పెంచాలని నిర్ణయించారు. ఎస్క్రో (వివాహం తర్వాత భార్యను తీసుకెళ్తానని మూడో వ్యక్తి సమక్షంలో పత్రము రాసుకుని ఆ తర్వాత అది చెల్లదని తప్పించుకోవడం) కేసుల్లో భార్యను వదిలేసి పారిపోయే ఎన్నారైల ఆస్తులను జప్తు చేసుకోవడంతోపాటు.. ఇలాంటి వివాహాల్లోని పలు సమస్యలను పరిష్కరించడంపైనా మంత్రివర్గ బృందం చర్చించింది. ఇందుకు నేర శిక్ష్మాస్మృతి నిబంధనలు, వివాహ చట్టం, పాస్‌పోర్ట్‌ చట్టాల్లో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. ప్రస్తుతం ఎన్నారై వివాహాల రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి సమయ పరిమితి లేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top