ప్రవాస భారతీయుడికి ప్రతిష్టాత్మక నోబెల్‌

Nobel Prize For Indian Economist Abhijit Banerjee For The Year 2019 - Sakshi

స్టాక్‌హోమ్‌ : ఆర్థిక శాస్త్రంలో విశేష సేవలందించిన ముగ్గురికి ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి వరించింది. 2019 ఏడాదికిగానూ అభిజిత్‌ బెనర్జీ, ఎస్తేర్‌ డుఫ్లో, మైఖేల్‌ క్రెమేర్‌లను సంయుక్తంగా నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్‌ స్వీడిష్‌ అకాడెమీ సోమవారం ప్రకటించింది. విశ్వవ్యాప్తంగా పేదరికాన్ని పారదోలడానికి అవసరమైన ఆర్థిక విధానాలపై చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు ప్రకటించినట్టు వెల్లడించింది. రెండు దశాబ్దాల వీరి కృషి ఫలితంగా పేదరిక నిర్మూలనలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అకాడెమీ తెలిపింది. వీరి ప్రయోగాత్మక విధానం ప్రపంచ పేదరికంతో పోరాడే మన సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగు పరిచిందని కమిటీ పేర్కొంది. కోల్‌కతాలో జన్మించిన అభిజిత్‌ బెనెర్జీ అమర్థ్యాసేన్‌ తర్వాత భారత్‌ తరపున నోబెల్‌ పొందిన వాడిగా చరిత్ర సృష్టించారు. అమెరికాలో స్థిరపడిన అభిజిత్‌ ఫ్రెంచ్‌-అమెరికన్‌ ఎస్తేర్‌ డుఫ్లో దంపతులు కావడం విశేషం. 

(చదవండి : ఇథియోపియా ప్రధానికి శాంతి నోబెల్‌)


ఎస్తేర్‌ డుఫ్లో, అభిజిత్‌ బెనర్జీ దంపతులు

ప్రైజ్‌మనీ 9 మిలియన్‌ డాలర్లు..
అభిజిత్‌ బెనెర్జీ (58) హార్వార్డ్‌ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. ప్రసిద్ధ మసాచూసెట్స్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక పారిస్‌లో జన్మించిన ఎస్తేర్‌ డుఫ్లో (47) మసాచుసెట్స్‌ యూనివర్సిటీ ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. అక్కడే ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దంపతులైన ఈ ఇద్దరూ అమెరికాకు చెందిన మరో శాస్త్రవేత్త మైఖేల్‌ క్రెమెర్‌ (55)తో కలిసి పేదరికాన్ని ఎదుర్కోవడానికి ప్రయోగాత్మక విధానాలను రూపొందించారు. ఈ ముగ్గురికీ కలిపి ప్రైజ్‌మనీగా 9 మిలియన్ల డాలర్లను నోబెల్‌ కమిటీ ఇవ్వనుంది.

తన కొడుకు, కోడలుకు నోబెల్‌ బహుమతి వరించడంతో అభిజిత్‌ బెనెర్జీ తల్లి నిర్మలా బెనెర్జీ ఆనందం వ్యక్తం చేశారు. ‘బెంగాల్‌కు చెందిన రెండో వ్యక్తి నోబెల్‌ పొందడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ ప్రతిష్టాత్మక బహుమతితో దేశం గర్వించేలా చేసిన అభిజిత్‌కు అభినందనలు’అని బెంగాల్‌ ​ముఖ్యమంత్రి మమతా బెనెర్జీ ట్విటర్‌లో పేర్కొన్నారు. అభిజిత్‌ బెనెర్జీకి నోబెల్‌ రావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పేదరికాన్ని పారదోలడానికి అభిజిత్‌ తన పరిశోధనలతో ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. నోబెల్‌ విజేతలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అభిజిత్‌ బెనెర్జీతో కలిసి ఎస్తేర్‌ డుఫ్లో, మైఖేల్‌ క్రెమేర్‌ పేదరిక నిర్మూలనకై ప్రయోగాత్మక పరిశోధనలు చేశారని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top