కన్‌ఫ్యూజన్‌లో విమానం కూల్చారు

Nepal Plane Crash Came After Confused - Sakshi

సాక్షి, కఠ్మాండు : నేపాల్‌ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి కొత్త విషయం తెలిసింది. సాంకేతిక సమస్యవల్ల ఆ ప్రమాదం జరగలేదని సమాచార బదిలీ విషయంలో అస్పష్టత ఏర్పడి చోటు చేసుకున్నట్లు తెలిసింది. కన్‌ఫ్యూజన్‌లో పైలెట్‌ విమానాన్ని కూల్చినట్లు స్పష్టమైంది. విమానం దింపే సమయంలో పక్కకు తిప్పాలని చెప్పినప్పటికీ తన వాయిస్‌ సరిగా వినకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ చెప్పాడు. కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా నుంచి 67 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

అయితే, తొలుత సాంకేతిక సమస్య ఇందుకు కారణం అని అనుకున్నారు. అయితే, వాస్తవానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌, పైలట్‌కు మధ్య సంభాషణలో తికమకే అంతమంది ప్రాణాలుపోవడానికి కారణమని తెలిసింది. రేడియో ద్వారా జరిగిన వారి సంభాషణ చాలా కన్‌ఫ్యూజ్‌గా సాగిందంటూ ఎయిర్‌ ట్రాఫిక్‌ నియంత్రణ సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అందులో పేర్కొన్న ప్రకారం విమానం సరిగ్గా ల్యాండ్‌ అయ్యే సమయంలో మాత్రమే పైలట్‌ తాము దిగొచ్చా అని అడిగాడు. అప్పటికే ఆలస్యం అయింది. అది చూసిన కంట్రోలర్‌ వణికిపోతున్న స్వరంతో వెంటనే వెనక్కు తిప్పాలని ఆదేశించాడు. ఆ వెంటనే ఫైర్‌ సిబ్బంది కూడా రన్‌వే వైపు ఫాస్ట్‌గా వెళ్లాలని ఆదేశించాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.

'రన్‌వేకి తగినట్లు విమానం రాలేదు. అప్పటికీ ఎయిర్‌ కంట్రోల్‌ టవర్‌ నుంచి పైలట్‌ను ఈ విషయంపై పలుసార్లు చెప్పినా అతడు మాత్రం అంతా బాగానే ఉందని, అన్నింటికీ యస్‌ అంటూ బదులిచ్చాడు' అని జనరల్‌ మేనేజర్‌ రాజ్‌కుమార్ చేత్రి చెప్పారు. కాగా, అమెరికా-బంగ్లా ఎయిర్‌లైన్స్‌ సీఈవో ఇమ్రాన్‌ అసిఫ్‌ మాత్రం ఢాకాలో మాట్లాడుతూ 'ఇదే స్పష్టమైన కారణం అని మేం చెప్పలేం.. కానీ, కచ్చితంగా కఠ్మాండు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ టవర్‌ మా పైలట్లను రన్‌ వే విషయంలో తప్పుదారి పట్టించింది. పైలట్లకు, టవర్‌కు మధ్య జరిగిన సంభాషణ విన్న తర్వాత మా పైలట్ల నిర్లక్ష్యం లేదని స్పష్టమైంది' అని అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top