
జానీ డెప్.. రెండు కుక్క పిల్లల కథ!
జానీ డెప్.. గుర్తున్నాడా?
జానీ డెప్.. గుర్తున్నాడా? అదేనండి ‘పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్’ సినిమాలో పిల్లి గడ్డం హీరో! ఆయన పెంచుకుంటున్న కుక్క పిల్లలు ఇప్పుడు ఆస్ట్రేలియా, అమెరికాలో పతాక శీర్షికలకెక్కాయి. ఎందుకంటారా..? కేవలం ఆ రెండు కూనలను(పేర్లు.. పిస్టోల్, బూ) ఆస్ట్రేలియా నుంచి యమా అర్జెంట్‌గా అమెరికాకు ప్రైవేట్ విమానంలో పంపారట! అందులో విశేషమేమీ లేకపోయినా.. వాటిని పంపడానికి అయిన ఖర్చు ఎంతో తెలిస్తే మీరు కూడా నోరెళ్లబెడతారు! ప్రైవేటు జెట్‌లో వాటిని పంపేందుకు జానీ ఖర్చు చేసిన మొత్తం అక్షరాలా రూ.2.5 కోట్లు!! ఆయన ఇటీవల తన భార్య అంబర్ హెర్డ్(29)తో కలసి పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సిరీస్ సినిమా షూటింగ్ కోసం అమెరికా నుంచి ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు వచ్చారు.
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లలను కూడా వెంట తెచ్చుకున్నారు. అయితే ఆస్ట్రేలియాలోకి అడుగుపెట్టే ముందు.. నిబంధనల ప్రకారం ఆ కుక్కపిల్లలకు ఏ జబ్బులు లేవని నిర్ధారించే పరీక్షలను జానీ చేయించలేదు. (పెంపుడు జంతువులను తరలిస్తున్నప్పుడు వాటిద్వారా ఎలాంటి అంటువ్యాధులు తమ దేశంలోకి రాకుండా ఉండాలని ప్రతీదేశం ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తుంది). ఈ విషయం అధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలియడంతో వ్యవసాయ మంత్రి బార్నబై జోయిస్ రంగంలోకి దిగారు. ఇంతటి నేరానికి పాల్పడతారా అంటూ హూంకరించారు! ఆ కుక్కపిల్లలను తక్షణమే అమెరికా పంపాలన్నారు. లేదంటే రూల్స్ ప్రకారం రూ.2 కోట్ల వరకు జరిమానా కట్టేందుకు సిద్ధపడాలని స్పష్టంచేశారు. దీంతో చేసేది లేక జానీ.. అప్పటికప్పుడు దాదాపు రూ.2.5 కోట్లు వెచ్చించి ఓ ప్రైవేటు జెట్ ద్వారా వాటిని అమెరికాలోని లాస్ ఏంజిల్‌స్‌కు చేరవేశారు.