టోక్యోలోని మిత్సుయి గార్డెన్ యోత్సుయా హోటల్
గుండెపోటు మగవారికే ఎందుకు ఎక్కువగా వస్తుంది? అంటే.. ఆడవారు భావోద్వేగాలను ఎక్కువగా అణచిపెట్టుకోరు.
లండన్: గుండెపోటు మగవారికే ఎందుకు ఎక్కువగా వస్తుంది? అంటే.. ఆడవారు భావోద్వేగాలను ఎక్కువగా అణచిపెట్టుకోరు. బాధ కలిగితే బిడియం లేకుండా ఏడ్చేస్తారు. అందువల్ల మనసు తేలికపడి వారి గుండెకు ముప్పు తగ్గుతుందన్నది అంచనా. అందుకే కాబోలు.. మగువలు మనసారా ఏడ్చేందుకని టోక్యోలోని మిత్సుయి గార్డెన్ యోత్సుయా హోటల్ వారు ప్రత్యేకంగా ఏడ్చే గదులను ప్రారంభించారు! ఈ గదుల్లో ఏడుపుగొట్టు, విషాదభరిత సినిమాలను చూపించి మహిళల్ని తనివితీరా ఏడ్చేలా చేస్తారట.
2004 నాటి భూకంపం నుంచి బయటపడిన ఓ కుక్కపిల్ల కథతో వచ్చిన జపనీస్ సినిమాతో పాటు పలు విషాదభరిత సినిమాలను గదిని అద్దెకు తీసుకునే మహిళలకు చూపిస్తారు. కన్నీళ్లు తుడుచుకుంటూ సౌకర్యవంతంగా ఏడ్చేందుకుగాను ఖరీదైన టిష్యూ పేపర్లు కూడా అందజేస్తారట! ఏడ్వటం ద్వారా స్త్రీలు ఒత్తిడిని, భావోద్వేగ సమస్యలను తొలగించుకుని, కొత్త ఉత్సాహంతో జీవించేందుకు వీలవుతుందని వారు చెబుతున్నారు. ఏడ్పు గది అద్దె ఎంతో చెప్పలేదు కదూ.. ఒక రాత్రికి రూ. 5,321 మాత్రమే!


