breaking news
crying rooms
-
అశ్రువులూ ధైర్యమిస్తాయి
సంతోషం సగం బలం అన్నారు. అందుకే దానిని అందరితో పంచుకుంటాం. కాని దుఃఖం కూడా బలమే. మన స్పందనాగుణానికి కొలబద్ద. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి అన్నాడు ఆత్రేయ. కాని ఏడ్చే సందర్భాలలో వచ్చే కన్నీరు మనసును తేలికపరుస్తుందని నమ్మేవారున్నారు. జపాన్‌లో ‘క్రయింగ్ క్లబ్స్’ ఫేమస్. మన దేశంలో సూరత్‌లో ఉంది.ఉద్వేగాలు చుట్టుముట్టినప్పుడు, నిరాశ నిస్పృహలు లొంగదీస్తున్నప్పుడు వాటిని ఎదిరించడానికి కన్నీరును మించిన ఆయుధం లేదు.కరోనా వొత్తిడిని అశ్రువులతో జయించండి. సాక్షి ఫ్యామిలీ: అప్పుడే పుట్టిన శిశువు ఏడుస్తూ ఏ భూమ్మీదకు వొస్తాడు. అది దుఃఖం కాదు. తన రాకను వ్యక్తం చేసే ఆనందం. కళ్లు స్వచ్ఛమైన స్పందనావయవం. అవి అబద్ధం చెప్పలేవు. కల్మషంతో ఉండలేవు. కళ్లలోకి చూసి ఎదుటి మనిషి ఆలోచనలను పసిగట్టవచ్చు. అందుకే కళ్లు లోపలి భావోద్వేగాలకు కూడా అంతే స్వచ్ఛంగా స్పందిస్తాయి. సంతోషం వచ్చినా, దుఃఖం కలిగిన స్రావాలను వెదజల్లుతాయి. నలుగురితో చెప్పుకుంటే బాధ తగ్గుతుంది అంటారు పెద్దలు. నలుగురితో కలిసి ఏడిస్తే ఇంకా తగ్గుతుంది అంటున్నారు రోదన ప్రియులు. ఏడుపు చెడ్డది కాదు మన సమాజంలో ఏడ్వడాన్ని బలహీనమైన స్పందనగా చూశారు. ఏడుపు దాచుకుని ఉండటానికి ‘ధీరో లక్షణంగా’ చూశారు. స్త్రీలు తమ స్పందనను రోదన రూపంలో ఎక్కువ వ్యక్తపరచడానికి న్యూనత పరిచారు. ‘ఏడ్చే మగాణ్ణి నమ్మొద్దు’ అని కూడా అన్నారు. కన్నీరుకు అంత తక్కువ విలువ ఎందుకు ఇస్తున్నట్టు? గమనించి చూస్తే చిన్న పిల్లలకు ఏడుపు, కన్నీరు ఆయుధాలు అని గ్రహిస్తాము. వాళ్లు ఏది కావాలన్నా ఏడ్చి సాధించుకుంటారు. మనం కూడా ఎదుటివారు కన్నీళ్లు పెట్టుకొని ఏదైనా విషయం విన్నవించుకుంటే కరిగిపోతాము. మరి ఏడుపు బలమైన వ్యక్తీకరణే కదా. ‘దుఃఖం, విషాదం, బాధ కలిగినప్పుడు గుండె ఆ భావోద్వేగాలతో బరువెక్కుతుంది. వాటిని బయటపడేసి తేలికపడాలనుకుంటుంది. అందుకు కన్నీటిని మార్గంగా ఎంచుకుంటుంది’ అంటారు సూరత్‌లో ‘క్రయింగ్ క్లబ్’ నడుపుతున్న కమలేష్ మసాలావాలా. ఈయన అక్కడ ‘లాఫింగ్ క్లబ్’ నడిపేవారు. కాని కన్నీటికి ఉన్న స్వాంతనగుణం అర్థమయ్యాక ‘క్రయింగ్ క్లబ్’ నడుపుతున్నాడు. ప్రతి నెలలో ఆఖరు ఆదివారం ఈ క్లబ్ సభ్యులంతా సామూహికంగా ఏడుస్తారు. తమ గోడు వెళ్లబుచ్చుకుంటారు. తేలికపడి వెళతారు. ఏది చెప్పకున్నా తోటివారితో మనసారా ఏడ్చి సేద తీరేవారు కూడా ఉంటారు. ‘నా ఉద్యోగ వొత్తిడిని నేను ఇంటికెళ్లి కోపంగా మార్చి నా భార్య మీద చూపలేను. ఇక్కడ మనసారా ఏడ్చానంటే సగం విముక్తం అవుతాను’ అని ఈ క్లబ్ సభ్యుడైన ఒక పురుష ఉద్యోగి అన్నాడు. ‘ఇక్కడికొచ్చి నలుగురితో కలిసి ఏడుస్తూ ఉంటే కష్టలు, సమస్యలు, బాధలు, వొత్తిడి మన ఒక్కరి సొంతం కాదని మనలాంటి వాళ్లు చాలామంది ఉంటారని ఒక ధైర్యం వస్తుంది’ అని మరో పురుష సభ్యుడు అన్నాడు. ‘మగవాళ్లను ఏడవ్వొద్దు అంటారు కాని ఆ అవసరం వారికే ఎక్కువ’ అని మరికొందరు చెప్పారు. ఇప్పుడు ఏడ్వాలని ఉందా? అనంతమైన వేదన కలిగినప్పుడు మనిషి చేసే పని దేవుని ముందుకెళ్లి రోదించడం. కన్నీళ్లతో ప్రాధేయ పడటం. హిందూమతంలోకాని, ఇస్లాం, క్రైస్తవాలలో గాని దేవుని ముందు కన్నీటి విన్నపాలకు గౌరవం ఉంది. దేవుడు ఆ మొర ఆలకించినా ఆలకించకపోయినా ఆ ఏడుపు గుండెలను తేలిక పరుస్తుంది. ప్రతి మనిషికి అంతర్ కారణాల రీత్యా, బాహ్య కారణాల రీత్యా ఒక్కోసారి తీవ్ర నిస్సహాయత, ఆందోళన, వేదన, భయం, దుఃఖం కలుగుతాయి. అప్పుడు ఆ ఉద్వేగాన్ని లోలోపలే దాచిపెట్టడం చాలా అనవసరం. అనారోగ్యం. వాటిని బయటకు వెదజల్లాలి. అందుకు ఏడ్వాలి. ఒక్కరే ఏడ్వగలిగితే మంచిది. ఏవరితోనైనా చెప్పుకుని ఏడిస్తే మరీ మంచిది. ఇప్పుడు కరోనా వంటి విపరీత సమయంలో అంతటా భయాందోళనలు నిండి ఉన్న సమయంలో గంభీరంగా ఉండాల్సిన పని లేదు. దేవును ముందు ప్రార్థిస్తూ ఏడ్వదిలిస్తే హాయిగా ఏడవండి. మిత్రులతో మీ ఆందోళనను పంచుకుంటూ నిస్సిగ్గుగా ఏడవండి. వాళ్లు కూడా అదే ఆందోళనతో ఏడిస్తే కలిసి రోదించండి. ఇవన్నీ ఉద్వేగ మలినాలని శుభ్రపరుస్తాయి. దూరం దూరంగా ఉండి పోయిన కుటుంబ సభ్యులు, ఎక్కడెక్కడో చిక్కుబడిపోయిన అయినవాళ్లు, స్నేహితులు... అందరూ ఫోన్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకుంటూ, వస్తే కన్నీరు కారుస్తూ తేలికపడటంలో తప్పులేదు. ఒక్కసారి ఏడ్చేశాక ధైర్యం వస్తుంది. ఒక ఉదాత్త భావన కలుగుతుంది. సిట్యుయేషన్ పట్ల నిర్లిప్తత ఏర్పడుతుంది. ఇప్పుడు కాలసింది అదే. కనుక ఏడ్చి తేలిక పడండి. -
ఆడవారు మనసారా ఏడ్చేందుకు గదులు!
లండన్: గుండెపోటు మగవారికే ఎందుకు ఎక్కువగా వస్తుంది? అంటే.. ఆడవారు భావోద్వేగాలను ఎక్కువగా అణచిపెట్టుకోరు. బాధ కలిగితే బిడియం లేకుండా ఏడ్చేస్తారు. అందువల్ల మనసు తేలికపడి వారి గుండెకు ముప్పు తగ్గుతుందన్నది అంచనా. అందుకే కాబోలు.. మగువలు మనసారా ఏడ్చేందుకని టోక్యోలోని మిత్సుయి గార్డెన్ యోత్సుయా హోటల్ వారు ప్రత్యేకంగా ఏడ్చే గదులను ప్రారంభించారు! ఈ గదుల్లో ఏడుపుగొట్టు, విషాదభరిత సినిమాలను చూపించి మహిళల్ని తనివితీరా ఏడ్చేలా చేస్తారట. 2004 నాటి భూకంపం నుంచి బయటపడిన ఓ కుక్కపిల్ల కథతో వచ్చిన జపనీస్ సినిమాతో పాటు పలు విషాదభరిత సినిమాలను గదిని అద్దెకు తీసుకునే మహిళలకు చూపిస్తారు. కన్నీళ్లు తుడుచుకుంటూ సౌకర్యవంతంగా ఏడ్చేందుకుగాను ఖరీదైన టిష్యూ పేపర్లు కూడా అందజేస్తారట! ఏడ్వటం ద్వారా స్త్రీలు ఒత్తిడిని, భావోద్వేగ సమస్యలను తొలగించుకుని, కొత్త ఉత్సాహంతో జీవించేందుకు వీలవుతుందని వారు చెబుతున్నారు. ఏడ్పు గది అద్దె ఎంతో చెప్పలేదు కదూ.. ఒక రాత్రికి రూ. 5,321 మాత్రమే!


