ఇస్లామిక్ గ్రూపు అన్సరుల్లా బంగ్లా టీమ్ ఆపరేషన్స్ చీఫ్ దిదార్ హొస్సేన్ పాకిస్థాన్‌కు పరారయ్యాడని బంగ్లాదేశ్ పోలీసులు వెల్లడించారు.
ఢాకా: జమాత్-ఈ-ఇస్లామీ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న ఇస్లామిక్ గ్రూపు అన్సరుల్లా బంగ్లా టీమ్ ఆపరేషన్స్ చీఫ్ దిదార్ హొస్సేన్ పాకిస్థాన్‌కు పరారయ్యాడని బంగ్లాదేశ్ పోలీసులు వెల్లడించారు. ఢాకాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం రాత్రి చేసిన దాడుల్లో ఈ సంస్థకు చెందిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. వీరిని ప్రాథమికంగా విచారించడంతో సంస్థ ఆపరేషన్స చీఫ్ హోస్సేన్ పాక్‌కు పరారైనట్లు వెల్లడైందని తెలిపారు.
ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు మదర్సా విద్యార్థి అని, మిగిలిన వారు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరంతా తమ సంస్థ ద్వారా ఆల్ ఖైదా భావాలను ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అన్సరుల్లా బంగ్లా టీమ్ ఇస్లాంకు శత్రువులుగా పేర్కొంటూ అనేక మంది ప్రముఖ నాయకులను హత్య చేసేందుకు కుట్ర పన్నిందని వెల్లడించారు. ఇద్దరు మంత్రులను హత్య చేసేందుకు సంబంధించిన పత్రాలను కూడా తాము స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో అన్సరుల్లా బంగ్లా టీమ్ వ్యవస్థాపకుడు ముఫ్తీ జసీమ్ ఉద్దీన్ రహ్మానీతో పాటు అనేక మంది అనుచురులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


