ఐసిస్ కొత్త చీఫ్‌గా అబూ ఇబ్రహీం అల్ హష్మీ

బీరుట్: ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) తమ కొత్త నాయకుడి పేరును ప్రకటించింది. గత వారం సిరియాలో అమెరికా జరిపిన దాడుల్లో ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ హతమైన విషయం తెలిసిందే. తాజాగా ఐసిస్ కొత్త ఛీఫ్‌గా అబూ ఇబ్రహీం అల్ హష్మీని నియమించినట్లు ఆడియో రూపంలో వెల్లడించింది. అలాగే ఉత్తర సిరియా ప్రాంతంలో ఆదివారం కుర్దు సేనలతో కలిసి అమెరికా జరిపిన దాడుల్లో అల్ బాగ్దాదీ అత్యంత సన్నిహితుడు, సంస్థ అధికార ప్రతినిధి హసన్ అల్ ముజాహిర్ కూడా మృతి చెందినట్లు ఆడియో సందేశంలో పేర్కొంది. అయితే ఆడియోలో మాట్లాడిన అబూ హమ్జా అల్ ఖురేషీ ‘ఎక్కువ సంతోషించకండి’ అంటూ అమెరికాకు ఒక హెచ్చరికను జారీచేశాడు. త్వరలోనే బాగ్దాదీ చావుకు కారణమైన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆడియోలో స్పష్టం చేశారు.
గత వారం ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకొని జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఎనిమిది హెలికాప్టర్‌లను ఉపయోగించి అమెరికా దళాలు ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశాయి. సిరియాలోని ఇడ్లిబ్ ప్రాంతంలో 90 నిమిషాలు పాటు ఈ దాడులు జరిపినట్లు అమెరికా రిలీజ్ చేసిన వీడియోలో బహిర్గతమయింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి