‘పాక్‌కు దీటుగా బదులిస్తాం’

India Stand by Ramzan ceasefire, Says Nirmala Sitharaman - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పాకిస్థాన్‌కు ధీటైన బదులిస్తామని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. రంజాన్‌ నేపథ్యంలో సరిహద్దు వ్యవహారంపై ఆమె మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా పాక్‌తో చర్చల అంశంపై ఆమె స్పందించారు. 

‘ ఓవైపు సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ‌.. మరోపక్క చర్చలంటే కుదిరే పని కాదు. ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి కుదరవు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించి శాంతి వాతావరణం నెలకొంటేనే చర్చలు. అలా కాదని ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ధీటైన జవాబిస్తాం. సరిహద్దులను సురక్షితంగా ఉంచటం మా బాధ్యత. భారత్‌ కాల్పుల ఉల్లంఘన ఒప్పందానికి కట్టుబడి ఉంది. అంతేగానీ కవ్వింపు చర్యలను ఉపేక్షించబోదు’ అని ఆమె పేర్కొన్నారు. ఇక రక్షణ రంగంలో భారత్ -రష్యా సహకారంపై ఆమె స్పందించారు. ‘రక్షణ రంగంలో భారత్ -రష్యా సహకారం, సంబంధాలు చాలా ధృడమైనవి. రాఫెల్ జెట్స్ కొనుగోళ్ళలో ఎటువంటి కుంభకోణం జరగలేదు. ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది. యూపీఏ హయాంలో ఆయుధాల కొరత ఉండేది. 2013-14 లో 87 వేల కోట్లకు గాను 79వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ, ప్రస్తుతం భద్రతా బలగాలకు ఆయుధాల కొరత లేదు. 2017-18లో 86488 కోట్ల కేటాయింపులకు గాను 90460 ఖర్చు చేశాం. అవసరమైన ఆయుధాలు కొనే అధికారాన్ని సులభతరం చేశాం’ అని ఆమె వివరించారు. 

కంటోన్మెంట్ల రోడ్ల గురించి.. ‘దేశంలోని 62 కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై పలు విజ్ఞప్తులు అందాయి. టీఆర్‌ఎస్‌(తెలంగాణ) సహా పలు పార్టీల ప్రతినిధులతో చర్చించాం. మిలటరీ, సివిల్ సొసైటీతో సమావేశాలు నిర్వహించాం. రోడ్ల మూసివేతపై ఎంపీలు చేసిన విజ్ఞప్తిలో అర్ధముంది. ఇప్పటిదాకా 850రోడ్లు మూసివేయబడ్డాయి. 119 రోడ్లు నిబంధనలు పాటించకపోవటంతో మూసేశారు. 80 రోడ్లను మళ్ళీ తెరిపించాం. 15 రోడ్లను పాక్షికంగా తెరిచాం. 24 ఇంకా మూసివేసే ఉన్నాయి ’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top