భారత్‌కు ఆ సత్తా ఉంది | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఆ సత్తా ఉంది

Published Fri, Jul 10 2015 1:07 AM

భారత్‌కు ఆ సత్తా ఉంది - Sakshi

సరిహద్దుల రక్షణపై రక్షణ మంత్రి పారికర్
లక్నో: తమ మనుగడ కోసం అవసరమైతే అణు బాంబులను ఉపయోగిస్తామని పాకిస్తాన్ మంత్రి ఖ్వజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తిప్పికొట్టారు. తమ సరిహద్దులను రక్షించుకోగల సత్తా భారత్‌కు ఉందని గురువారం లక్నోలో స్పష్టంచేశారు. పాక్ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు పారికర్ పైవిధంగా స్పందించారు. భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు రష్యాలో భేటీ అవుతున్న నేపథ్యంలో పారికర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ముంబై దాడుల సూత్రధారి జకీ ఉర్ రెహ్మాన్‌ను విడుదల చేసినందుకు పాకిస్తాన్‌పై ఐక్యరాజ్యసమితి ప్రతిపాదిత చర్యను చైనా అడ్డుకుంటోందన్న ప్రశ్నకు బదులివ్వడానికి పారికర్ నిరాకరించారు. ఆ విషయాన్ని విదేశాంగ శాఖ లేదా ప్రధానమంత్రి చూసుకుంటారన్నారు. పాక్ సరిహద్దులో మిలిటెంట్ల ఏరివేతకు మయన్మార్‌లో కమాండోలు జరిపిన ఆకస్మిక దాడిలాంటి చర్యలకు దిగుతారా అన్న ప్రశ్నకు, అవన్నీ ప్రభుత్వం రహస్యంగా చేసే చర్యలని, వీటిపై మీడియాతో పంచుకోలేమని బదులిచ్చారు. గతంతో పోలిస్తే తమ హయాంలో సరిహద్దు ఉగ్రవాదం తగ్గిందని పారికర్ చెప్పారు.
 
త్వరలో శుభవార్త

మాజీ సైనికుల దీర్ఘకాల డిమాండ్ ‘ఒక ర్యాంక్ ఒకే పింఛన్’(ఓఆర్‌ఓపీ)పై త్వరలోనే శుభవార్త వింటారని మనోహర్ పారికర్ వెల్లడించారు.  రక్షణ శాఖ అంతర్గత వ్యవహారమైన ఈ అంశంపై తమ పనులన్నీ పూర్తయ్యాయని తెలిపారు. త్వరలోనే ఈ విషయంపై శుభవార్త వెలువడనుందని స్పష్టం చేశారు. గతంలో ప్రధానమంత్రి మోదీ ఓఆర్‌ఓపీపై తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement