భారత్‌లో పత్రికా స్వేచ్ఛ దారుణం

India drops down on World Press Freedom Index - Sakshi

140వ ర్యాంకుకు పరిమితం

పాత్రికేయులపై బీజేపీ నేతల దాడులు పెరిగాయి: ఆర్‌ఎస్‌ఎఫ్‌

లండన్‌: పత్రికా స్వేచ్ఛలో భారత్‌ తాజాగా మరో రెండు స్థానాలు దిగజారి 140వ ర్యాంకుకు పరిమితమైంది. పారిస్‌ కేంద్రంగా పనిచేసే రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) అనే స్వచ్ఛంద సంస్థ 2019 ఏడాదికి పత్రికా స్వేచ్ఛ అంశంలో 180 దేశాలకు ర్యాంకులు కేటాయించింది. ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ – 2019’ పేరిట ఓ నివేదికను సంస్థ గురువారం విడుదల చేసింది. ఎన్నికల సమయం కావడంతో పాత్రికేయుల మీద అధికార బీజేపీ నేతల దాడులు పెరిగిపోయాయని సంస్థ ఈ నివేదికలో పేర్కొంది. భారత్‌లో గతేడాది జర్నలిస్టులపై జరిగిన హింసాత్మక దాడుల్లో ఆరుగురు చనిపోయారనీ, ఏడవ జర్నలిస్టు మృతి అంశంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయంది. ‘భారత్‌లో పాత్రికేయులపై పోలీసులు, మావోయిస్టులు, నేర ముఠాలు, అవినీతి రాజకీయ నాయకులు హింసాత్మక దాడులకు పాల్పడటం, వారిని బెదిరించటం వంటివి చేస్తున్నారు.

ఇలాంటి దాడుల వల్ల గతేడాది ఆరుగురు జర్నలిస్టులు చనిపోయారు’ అని నివేదిక తెలిపింది. ఆంగ్లేతర భాషల మీడియాకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయంది. 2018లో భారత్‌కు 138వ ర్యాంకు దక్కగా తాజాగా 140వ స్థానానికి చేరింది. ఇక 2019 ఏడాదికి ప్రపంచ పత్రికా స్వేచ్ఛలో నార్వే మూడోసారి తొలి ర్యాంకు పొందింది. ఫిన్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్‌ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్‌కు పొరుగు దేశాలైన పాకిస్తాన్‌ 142వ ర్యాంకు, బంగ్లాదేశ్‌ 150వ ర్యాంకు పొందాయి. సూచీ చిట్టచివరన తుర్క్‌మెనిస్తాన్‌ (180వ ర్యాంకు), ఉత్తర కొరియా (179), చైనా (177), వియత్నా (176) ఉన్నాయి. ఆఫ్రికా దేశాలైన ఇథియోపియా 110వ ర్యాంకును, గాంబియా 92వ ర్యాంకును పొందాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top