‘కొత్త పాకిస్తాన్‌ను పరిచయం చేసేవాడ్ని’

If I am In Power Introduce New Pakistan, Says Nawaz Sharif - Sakshi

ఇస్లామాబాద్: తనను ప్రధాని పదవి నుంచి తప్పించకపోయి ఉంటే పాకిస్తాన్‌ను తాను ఉన్నతస్థితికి తీసుకెళ్లేవాడినని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఏఆర్‌వై మీడియాతో సోమవారం మాట్లాడుతూ షరీఫ్ పలు విషయాలను ప్రస్తావించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, కానీ ప్రస్తుతం పాక్‌లో అలాంటివేం లేవన్నారు. 

మరికొంత కాలం తనకు అధికారం అప్పగించి ఉంటే కొత్త పాకిస్తాన్‌ను ప్రపంచానికి పరిచయం చేసేవాడినంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తనకు అలాంటి అవకాశం లేదని, జీవితకాలం ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయరాదని, ప్రభుత్వ పదవులు చేపట్టరాదని పాక్‌ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనపై మాట్లాడుతూ భారత్-పాక్ సంబంధాలు మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు చెప్పారు.  

పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ ప్రధాని షరీఫ్ నిప్పులు చెరిగారు. ఇటీవల పీటీఐ చీఫ్ ఇమ్రాన్ 11 పాయింట్ల ఎజెండా (విద్య, వ్యవసాయం, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థికరంగం, పోలీసు వ్యవస్థ, మహిళా విద్య మొదలైనవి) తన లక్ష్యమని ప్రకటించగా.. అది తన ఎజెండా అన్నారు. ఇమ్రాన్ ఇతరుల లక్ష్యాలను కాపీ కొడుతూ, తాను దేశానికి సేవ చేయాలనుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నాడని షరీఫ్ విమర్శించారు.

కాగా, పనామా పేపర్ల కేసుకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆదాయ వివరాలను వెల్లడించకపోవడంతో జస్టిస్‌ అసిఫ్‌ సయీద్‌ ఖోసా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన పాక్‌ సుప్రీం బెంచ్‌ గత ఏడాది జులై 28న నవాజ్‌ను అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన షరీఫ్‌ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. షరీఫ్‌తో పాటు పీటీఐ సెక్రటరీ జనరల్‌ జహంగీర్‌ తరీన్‌పైనా జీవిత కాలంలో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top