దిగ్గజ బ్యాంకులో 35 వేల ఉద్యోగాల కోత

 HSBC announces massive job cuts as profits plunge - Sakshi

హాంకాంగ్‌: ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ భారీ నష్టాల కారణంగా వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. గత ఏడాది లాభాలు మూడో వంతు పడిపోవడంతో ఖర్చులకు తగ్గించుకునే పనిలో పడింది. ముఖ్యంగా అమెరికా, ఐరోపాలో 35 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది.  కోతలు చాలావరకు యూరోపియన్ , అమెరికా  ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్ రంగాలలో ఉండనున్నాయి.

అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌ కారణంగా అనేక అనిశ్చితులను ఎదుర్కొన్న బ్యాంకు తాజాగా ఉద్యోగాల కోత నిర్ణయం తీసుకుంది. అలాగే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుండి నిష్క్రమించడం (బ్రెగ్జిట్‌), కొత్తగా చైనాలో విస్తరించిన కరోనా వైరస్‌ కోవిడ్‌-19 కూడా తీవ్ర ప్రభావాన్ని చూపనుందని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఆగస్టులో జాన్ ఫ్లింట్‌కు అనూహ్యంగా  ఉద్వాసన పలికిన తర్వాత యాక్టింగ్ సీఈవోగా నోయెల్ క్విన్ బాధ్యతలు స్వీకరించారు.  50కి పైగా దేశాలకు విస్తరించి ఉన్న  హెచ్‌ఎస్‌బీసీని ఆసియాలో  లాభాల బాట పట్టించి, విశాలమైన అంతర్జాతీయ బ్యాంకును మార్చే వ్యూహంలో ఉన్నారు. అయితే తమ వ్యాపారం ఆశించిన రాబడిని ఇవ్వడంలేదనీ, ఈ నేపథ్యంలోనే పెట్టుబడిదారులకు రాబడిని పెంచేలా కొత్త ప్రణాళికను రూపొందిస్తున్నామని క్విన్ చెప్పారు. ఖర్చులు తగ్గించడంతోపాటు, తమ సంక్షిష్ట సంస్థాగత నిర్మాణాన్ని సరళీకృతం చేయనున్నామని పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో గ్లోబల్ హెడ్‌కౌంట్‌ను 235,000 నుండి 200,000 కు తగ్గించనున్నట్లు వెల్లడించారని   బ్లూమ్‌బెర్గ్ న్యూస్‌ తెలిపింది.

అమెరికాలో బ్యాంక్ తన బ్రాంచ్ నెట్‌వర్క్‌ను సుమారు 30 శాతం తగ్గించాలని, బ్యాక్ ,మిడిల్ ఆఫీస్ కార్యకలాపాలను ఏకీకృతం చేయాలని, నిర్వహణ ఖర్చులను 10-15 శాతం తగ్గించాలని యోచిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. మెక్సికన్ మనీలాండరింగ్ కుంభకోణంలో  చిక్కుకున్న హెచ్‌ఎస్‌బిసి 2012నుండి కీలక పునర్నిర్మాణ ప్రణాళికలను చేపట్టింది. 2022 నాటికి 4.5 బిలియన్ డాలర్ల వ్యయ కోతలను లక్ష్యంగా పెట్టుకున్నామని, పునర్నిర్మాణ వ్యయాలు 6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని బ్యాంక్ ఒక తెలిపింది. చైనాలో ఘోరమైన కరోనావైరస్ వ్యాప్తి 2020 లో ఆసియాలో వృద్ధి అంచనాలను తగ్గించిందని హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. దీంతో హాంకాంగ్‌లో హెచ్‌ఎస్‌బీసీ షేర్లు 2.2 శాతం పడిపోయాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top