వారికి ఇల్లే అతి ప్రమాదకరం : షాకింగ్‌ రిపోర్టు

Home - The most dangerous place for a woman, says United Nations report  - Sakshi

మహిళలపై హింస నిరోధక అంతర్జాతీయ దినోత్సవం -ఐక్యరాజ్యసమితి రిపోర్ట్‌

మహిళలకు ఇల్లే అతి ప్రమాదకరమైన ప్రదేశం :  రిపోర్టు

కుటుంబ సభ్యుల  చేతుల్లో రోజుకు 137మంది మహిళలు  బలి

తెలిసినవారి చేతుల్లోనే గంటకు ఆరుగురు మహిళలు హత్య

మహిళలు,ఆడపిల్లలపై పెరుగుతున్న హింస, అత్యాచారాలు, హత్యల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. రోజురోజుకు ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితి అధ‍్యయనం దిగ్భ్రాంతికరమైన అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ నేలపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం మహిళలకు ఇల్లేనట. అవును..షాకింగ్‌గా ఉన్నా.. మీరు విన్నది నిజమే సొంత ఇల్లే ఆమె పాలిట యమపాశమవుతోంది. మరింత ఆశ‍్చర్యకరమైన విషయం ఏమిటంటే... కుటుంబ సభ్యులు, సన్నిహిత జీవిత భాగస్వాములే చేతుల్లో అత్యధిక మహిళలకు హత్యకు గురవుతున్నారని యూఎన్‌ సర్వే తేల్చింది .

మహిళలపై లైంగిదాడులు, గృహహింస, హత్యాచారాలు నిత్యకృత్యంగా మారిపోయాయి.ఆడవారిగా పుట్టిన పాపానికి ప్రపంచవ్యాప్తంగా  మహిళలు, ఆడపిల్లలు దారుణ హత్యలకు గురవుతున్నారని ‘మహిళలపై హింస- అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం' సందర్భంగా  నిర్వహించిన యూఎన్‌ఓడీసీ సర్వే తేల్చింది.

2018 నివేదిక ప్రకారం 2017లో హత్యకు గురైన మహిళల్లో మూడోవంతు భర్తల చేతుల్లో పథకం ప్రకారం హతమవుతున్నారు. రోజుకు 137 మందిని సొంత కుటుంబ సభ్యులే హత్యగావిస్తున్నారు. 2017లో ప్రపంచవ్యాప్తంగా 87వేలమంది హత్యకు గురయ్యారు. వీరిలో 58శాతం అంటే దాదాపు 50వేలమంది కుటుంబ సభ్యులు, సన్నిహిత భాగస్వాములు చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 30 వేలమంది ఒక పథకం ప్రకారం చంపబడుతున్నారు. ప్రపంచవ్యాప్తగా ప్రతి లక్షమంది జనాభాలో 1.3 శాతం మంది పుట్టకముందే గర్భంలోనే హత్యకు గురవుతున్నారు.

భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల ద్వారా హత్యకు గురవుతున్న మహిళలు : 
ఆసియా - 20,000
ఆఫ్రికా - 19,000
అమెరికా - 8,000
యూరోప్ - 3,000
ఓసియానా - 300

ఎందుకు జరుగుతుంది?
వివిధ కారణాల వలన అన్ని సమాజాల్లో లింగ-సంబంధిత హత్యలు జరుగుతున్నాయని సమితి నివేదించింది. ముఖ్యంగా భ్రూణ హత్యలు, జీవిత భాగస్వామి హింస, గృహ హింస, పరువు హత్యలు, వరకట్న సంబంధిత హత్యలున్నాయని నివేదిక పేర్కొంది. వీటితోపాటు వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్య ముఠాలు, భారీ వలసలు, డ్రగ్స్‌, ట్రాఫికింగ్‌ ఉదంతాల్లో హింసాత్మక హత్యలు చోటు చేసుకుంటున్నాయని సర్వే తెలిపింది. అలాగే చేతబడి, మంత్రగత్తెల ఆరోపణలతో కూడా హత్యలు జరుగుతున్నాయని నివేదించింది. సాయుధ ఘర్షణ సందర్భాల్లో మహిళలపై లైంగిక హిం‍సను  ప్రదాన ఆయుధంగా ప్రయోగించబడుతోందని పేర్కొంది.


 

అనేక సందర్భాల్లో మహిళలపై హింస హత్యలకు దారితీస్తోందని, అయితే మహిళలకు, బాలికలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసకు పాల్పడుతున్న నేరస్తులు  నేరాలు  నిరూపితం కావడంలలేదని, దీంతో వారు శిక్షలనుంచి తప్పించుకుంటున్నారని తెలిపింది. మహిళలపై హింస నిర్మూలించేందుకు చట్టాలు, పథకాలు ఉన్నప్పటికీ సన్నిహిత భాగస్వామి / కుటుంబ సంబంధిత హత్యలు ఆగడం లేదనీ, ఇటీవల సంవత్సరాల్లో భ్రూణ హత్యల నిరోధంలో ఎలాంటి పురోగతి లేదని స్పష్టం చేసింది. మానవహత్యల్లో మెజారిటీ బాధితులుగా పురుషులు కూడా ఉంటున్నప్పటికీ లింగ అసమానత, వివక్ష, మూఢాచారాల ఫలితంగా మహిళలు మరింత ప్రభావితమవుతున్నారని యూఎన్‌ఓడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యూరీ ఫిడోటోవ్ సెడ్ పేర్కొన్నారు.

మహిళలపై హింస నిరోధంపై అంతర్జాతీయ దినోత్సవం సందర్బంగా నవంబరు 25  ఆదివారం  ఈ అధ్యయనాన్ని విడుదల చేసింది. మహిళలు, బాలికలపై లింగ సంబంధిత హత్యలు, దాడులను సమర్థవంతంగా అడ్డుకునేందుకు, దర్యాప్తు, విచారణకు, శిక్షలు తదితర అనేక ఆచరణాత్మక చర్యలను ఇందులో సిఫార్సు చేసింది. అలాగే న్యాయనిర్ణేతలు, పాలకులు, ప్రభుత్వ సంస్థలతోపాటు ఐక్యరాజ్యసమితి సంస్థలు, సిబ్బంది, పౌర సమాజాల మధ్య అవగాహన కోసం  అధ్యయనాన్ని వెల్లడించినట్టు తెలిపింది. మహిళలపై హింస నిరోధానికి పోలీసులకు న్యాయవ్యవస్థలు, ఆరోగ్యం,సామాజిక సేవలకు మధ్య సమన్వయం చాలా అవసరమని ఈ నివేదిక నొక్కి చెప్పింది. ప్రాథమిక  విద్య, అవగాహనతో పాటు ఈ సమస్యల పరిష్కాల్లో ఎక్కువ పురుషులు పాల్గొనడం చాలా ముఖ్యమని  యూఎన్‌ నివేదిక స్పష్టం చేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top