విశ్రమించిన శాంతి కపోతం

Former UN  Secretary General  Kofi Annan Died - Sakshi

ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ కన్నుమూత

జెనీవా / ఆక్రా : ఐక్యరాజ్యసమితి(ఐరాస) మాజీ ప్రధాన కార్యదర్శి, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కోఫీ అన్నన్‌(80) తుదిశ్వాస విడిచారు. స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న అన్నన్‌ స్విట్జర్లాండ్‌లో శనివారం కన్నుమూసినట్లు కోఫీ అన్నన్‌ ఫౌండేషన్‌ ట్విట్టర్‌లో తెలిపింది. ఐరాస ఏడవ ప్రధాన కార్యదర్శిగా 1997 నుంచి 2006 వరకూ రెండు పర్యాయాలు అన్నన్‌ పనిచేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఆఫ్రికన్‌గా అన్నన్‌ చరిత్ర సృష్టించారు. ప్రపంచశాంతి కోసం చేసిన కృషికి గానూ 2001లో ఆయన్ను నోబెల్‌ శాంతి బహుమతి వరించింది. ఐరాసలో చిన్నస్థాయి దౌత్యాధికారిగా 1961లో చేరిన అన్నన్‌ ఏకంగా ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. ఇరాక్‌ యుద్ధం సమయంలో అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను భద్రతామండలిలో అన్నన్‌ ఒక్కటి చేశారు. దీంతో ఐరాస అనుమతి లేకుండానే అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ ప్రభుత్వం ఇరాక్‌పై యుద్ధం ప్రకటించింది.

ఐరాస ప్రధాన కార్యదర్శిగా తప్పుకున్న తర్వాత కూడా అన్నన్‌ ప్రపంచ శాంతి కోసం విస్తృతంగా కృషి చేశారు. 2012లో ఐరాస–అరబ్‌లీగ్‌ ప్రత్యేక దూతగా అన్నన్‌ సిరియాకు వెళ్లారు. అన్నన్‌ మృతిపై ఐరాస ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రపంచ శాంతిస్థాపనలో అన్నన్‌ ఓ మార్గదర్శక శక్తిగా పనిచేశారు. ఆయన మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఐక్యరాజ్యసమితి అంటే కోఫీ అన్ననే. అసమాన గౌరవం, అంకిత భావంతో అన్నన్‌ చిన్న ఉద్యోగి స్థాయి నుంచి ఐరాసకు నేతృత్వం వహించే స్థానానికి ఎదిగారు’అని గ్యుటెరస్‌ తెలిపారు. కోఫీ అన్నన్‌ స్థానాన్ని భర్తీచేయలేమన్న ఘనా అధ్యక్షుడు నన అకుఫో అడ్డో.. ఏడు రోజుల పాటు దేశంలో సంతాప దినాలను ప్రకటించారు. అలాగే అన్నన్‌ గౌరవార్థం ఘనాతో పాటు విదేశాల్లోని రాయబార కార్యాలయాల్లో జాతీయ జెండాను సగం వరకూ అవనతం చేయాలని ఆదేశించారు.  

ఆఫ్రికాలో పుట్టి.. ఐరాసలో అత్యున్నత స్థాయికి
ఆఫ్రికా దేశమైన ఘనాలోని కుమసి పట్టణంలో ఓ ధనిక కుటుంబంలో 1938, ఏప్రిల్‌ 8న కోఫీ అట్టా అన్నన్‌ జన్మించారు. అన్నన్‌ తండ్రి ఘనాలో ఓ ప్రావిన్సు గవర్నర్‌ కాగా, ఆయన తాతయ్యలు రెండు తెగలకు పెద్దలుగా ఉన్నారు. బోర్డింగ్‌ స్కూల్‌లో చదువుకున్న అన్నన్‌ ఇంగ్లిష్, ఫ్రెంచ్‌ సహా పలు ఆఫ్రికన్‌ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. మిన్నెసొటాలోని మెకలెస్టర్‌ కాలేజీలో ఎకనమిక్స్‌లో డిగ్రీ పొందిన ఆయన.. స్విట్జర్లాండ్‌లో అంతర్జాతీయ వ్యవహారాలపై గ్రాడ్యుయేషన్‌ చేసేందుకు వెళ్లారు. అక్కడే ఐరాసలో చిన్న ఉద్యోగిగా చేరారు. 1965లో నైజీరియన్‌ మహిళ తితి అలకిజను పెళ్లిచేసుకున్నారు. ఈ దంపతులకు అమా అనే కుమార్తె, కొజొ అనే కుమారుడు ఉన్నారు. 1971లో అమెరికాకు తిరిగివచ్చిన అన్నన్‌.. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) నుంచి మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న అన్నన్‌ 1984లో స్వీడిష్‌ లాయర్‌ నానే లగెర్‌గ్రెన్‌ను పెళ్లాడారు.

ఇథియోపియాలో ఐరాస ఆర్థిక కమిషన్‌ సభ్యుడిగా, ఈజిప్ట్‌లో ఎమర్జెన్సీ ఫోర్స్‌లో, జెనీవాలోని శరణార్థుల హైకమిషన్‌లో అన్నన్‌ విధులు నిర్వహించారు. అనంతరం న్యూయార్క్‌లో ఐరాస ప్రధాన కార్యాలయంలో మానవవనరులు, బడ్జెట్, ఆర్థిక వనరులు, భద్రత తదితర విభాగాల్లో కీలక స్థానాల్లో పనిచేశారు. చివరికి 1997లో ఐరాస ఏడవ ప్రధాన కార్యదర్శిగా కోఫీ అన్నన్‌ ఎన్నికయ్యారు. 1990వ సంవత్సరం లో గల్ఫ్‌ యుద్ధం సందర్భంగా ఇరాక్‌లో చిక్కుకుపోయిన 900 మంది విదేశీయుల్ని వారి స్వదేశానికి పంపడంలో అన్నన్‌ కీలకంగా వ్యవహరించారు. ఆ యుద్ధం తర్వాత అగ్రరాజ్యం అమెరికా ఆంక్షల నేపథ్యంలో చమురుకు బదులుగా ఇరాక్‌కు మానవతాసాయం అందజేసేందుకు ప్రారంభమైన చర్చలకు కోఫీ అన్నన్‌ నేతృత్వం వహించారు.   

మోదీ సంతాపం
అన్నన్‌ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్నన్‌ కేవలం గొప్ప దౌత్యవేత్త, మానవతావాది మాత్రమే కాదనీ, అంతర్జాతీయ, శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన కీలకపాత్ర పోషించారని వ్యాఖ్యానించారు. ఆఫ్రికాలో హింసను తగ్గించేందుకు అన్నన్‌ విశేష కృషి చేశారని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే అన్నారు. ప్రపంచం గొప్ప మానవతావాదిని కోల్పోయిందని స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సెంజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top