
టెక్సాస్ : తుపాను బాధితులకు అండగా నిలిచేందుకు ఐదుగురు అమెరికా మాజీ అధ్యక్షులు ఒకే వేదికమీదకు రానున్నారు. ఐదుగురు అమెరికా మాజీ అధ్యక్షులు టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో 'వన్ అమెరికా అప్పీల్' కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రకృతి పగబట్టిందా? అన్న రీతిలో అమెరికాపై ఇటీవల మూడు తుపానులు విజృంభించి ఎందరినో నిరాశ్రయులను చేసింది. హార్వే, ఇర్మా, మారియా హరీకేన్‌ల దాటికి అమెరికా కకావికలమై భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. బాధితులను ఆదుకోవడానికి భారీగా విరాళాల సేకరణ లక్ష్యంగా అమెరికా మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్, జార్జి హెచ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామాలు అక్టోబర్ 21న రీడ్‌అరెనాలో జరగనున్న 'వన్ అమెరికా అప్పీల్' కాన్సార్ట్‌లో పాల్గొననున్నారు.
ఈ మేరకు టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలోని కాలేజీ క్యాంపస్ స్టేడియంలోని హెచ్ డబ్ల్యూ ప్రెసిడెన్షియల్ లైబ్రెరీ ఓ ప్రకటన విడుదల చేసింది. మాజీ అధ్యక్షులతోపాటూ పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనన్నారు. గాస్పియల్ సింగర్స్ గట్లిన్ సోదరులు, పాప్ సింగర్స్ రాబర్ట్ ఎర్ల్ కీన్, లిలే లోవెట్, అలబామా కంట్రీ గ్రూప్, లీ గ్రీన్‌వుడ్‌లు తమ గాత్రంతో అతిధులను అలరించనున్నారు. టెక్సాస్, ఫ్లోరిడా, కరేబియన్‌లలో తుపానుబారిన పడిన వారి సంక్షేమం కోసం చేపట్టిన 'వన్ అమెరికా అప్పీల్' కార్యక్రమానికి రావడానికి అంగీకరించిన ప్రతి ఒక్కరికి జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడంతో పాటూ, బాధితులకు పునరావాస ఏర్పాట్లపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాతలు ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. సేకరించిన నిధులు బుష్ లైబ్రెరీ ఆధ్వర్యంలో లావాదేవీలు జరపనున్నారు.